పుట:2015.373190.Athma-Charitramu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44. ఉపాధ్యాయవృత్తి 191

కుటుంబభారము వహింపవలసిన నాకు, సర్వవిధములను ఉపాధ్యాయ వృత్తి నవలంబించుటయె కర్తవ్యముగఁ దోఁచెను.

స్వతంత్రబుద్ధియు, మనోనిశ్చయమును గలిగి కార్యసాధనము చేయుట విద్యాధికులధర్మ మనుట నిజమె. కాని, నిన్నటి వఱకును తలిదండ్రుల పరిపోషణముననుండి, తన విద్యావిషయమై వారిని మితిలేని వ్యయప్రయాసములపాలు చేసి, ఈనాఁడు విద్యాపరిపూర్తిచేసి, స్వతంత్రజీవనసంపాద్యము చేయుటకు శక్తి వచ్చినతోడనె, వారికి తన యూహాపోహలు సవిస్తరముగఁ దెలుపక, వారి యాలోచనలు సాకల్యముగ నాకర్ణింపక, బాధ్యతాయుతమగు వృత్తిసమస్యను తా నొకఁడె వేవేగముగఁ బరిష్కరింపఁబూనుట, ఏయువకునికిని సాహసకృత్యమె !

ఇంకొక కారణమువలనఁగూడ నా వృత్తినిర్ణయకార్యము, అసమగ్రము, అసంతృప్తికరము నయ్యెను. నే నిపుడు స్నేహితులతోఁ గలసి ఆస్తికపాఠశాలాసంస్థలోఁ బని చేయ నుద్యమించితినిగదా. అందలి యుపాధ్యాయు లందఱితోఁబాటుగ నాకు నచట నీయఁబడెడి స్వల్ప గౌరవవేతనముతో మా పెద్దకుటుంబమునకుఁ బోషణ మెట్లు జరుగఁ గలదు ? నేనుదక్క మాయిల్లు చక్క పెట్టఁగలవా రెవరు నీసమయమున లేరుకదా ? పోనిండు, స్వార్థచింతనము విడిచి, పారమార్థిక బుద్ధితోనె నే నీపాఠశాలానిర్వహణ మను గుండములో దుముక సిద్ధపడితి ననుకొన్నను, నన్నుఁ బెంచి పెద్దవానినిఁ జేసి నా శ్రేయస్సుగోరి, నామీఁద నాధారపడిన తలిదండ్రుల కీసంగతి ధారాళముగ నెఱిఁగించి, ముందు వారిదారి వారు చూచుకొనుఁడని చెప్పి వేయుట న్యాయ్యముగదా !