పుట:2015.373190.Athma-Charitramu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 190

పాదముద్రలనే యడుగులు వేయఁజూచునాకును ఉపాధ్యాయత్వమె యుక్త మైనదిగఁ గానఁబడెను. చిన్న నాఁడు ధవళేశ్వరమున నేనొక నెల యుపాధ్యాయునిగ నుంటిని. అపుడు విద్యా బోధనకార్యము నా కానందదాయకముగ నుండెను. నా తత్త్వమునకు సరిపడిన వృత్తి యిదియె యని నేను నిశ్చయించుకొంటిని.

మతసంఘసంస్కరణములలో బాగుగఁ గృషిచేయుటకై స్నేహితులము కొందఱము "ఆస్తికపాఠశాల" నొకటి రాజమంద్రిలో స్థాపించి, అందు నుపాధ్యాయుల మైనచో, "ఏక క్రియా ద్వ్యర్థకరీ" అనునట్టుగ నొకమూల జీవనసంపాదనము, ఇంకొకమూల జీవితాదర్శ సాఫల్యమును, బొందఁగల మని మేము తలపోసితిమి. ఇదివఱకె మండపేటలో నుపాధ్యాయుఁడుగ నుండిన మృత్యుంజయరావు, ముందు కూడ నదేవృత్తిలో నుండ నిశ్చయించి, యీసంవత్సరము రాజమంద్రి కళాశాలలో పట్టపరీక్షఁ బూర్తిచేసి, రాఁబోవుసంవత్సరమందు సైదాపేట బోధనాభ్యసనకళాశాలలోఁ బ్రవేశించి, యల్. టీ. పరీక్షలో జయ మందఁగోరెను. నేనును ఉపాధ్యాయునిగ నుండుటకే నిశ్చయించు కొంటిని. వీరేశలింగము వెంకటరత్నము నాయుఁడు గార్లు మున్నగు స్నేహితులు దీనికామోదించిరి. మాతోఁబాటుగ "ఆస్తికపాఠశాల"లో బనిచేయునుద్దేశముతో, రాఁబోవువత్సరమున సైదా పేట కళాశాలలోఁ జేరుట కింక నిద్దఱు ముగ్గురు స్నేహితులు సిద్ధముగ నుండిరి. కావున నేను పట్టపరీక్ష యైనతోడనే కాలయాపనముచేయక, బోధనాభ్యసన కళాశాలఁ జేరుట కర్తవ్య మని తోఁచెను. పిమ్మట నెటులైనను, మొట్టమొదటి రోజులలో నెక్కువజీతము విద్యాధికుల కనులఁ కగఁబడెడి వృత్తి యాకాలమున నుపాధ్యాయత్వమె. ముందు వెనువెంటనే