పుట:2015.373190.Athma-Charitramu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

43. పట్టపరీక్ష 187

వచ్చిన నేత్రమాంద్యచిహ్నములు గానఁబడెను. వ్యాధి యీనాఁడు పొడసూపెనా, రోజంతయు నాకు దృష్టిమాంద్యము, తలనొప్పియుఁ గలిగి మిగుల బాధపడియెడివాఁడను ! అట్టి పరిస్థితులలో నే నెట్లు ప్రశ్నములకు సమాధానములు వ్రాయనేర్తును ? అందుచే నేను మిగుల వగచితిని. విచారావేశముచే జనించిన దైన్యమున దేవదేవుని సాహాయ్యము నేను వేఁడికొంటిని. ఆదయామయుని యనుగ్రహమున నా కీజబ్బు రా దనియె నేను గట్టిగ నమ్మితిని. నా యాశ్చర్య మేమని చెప్పను ? భగవంతుని పరిపూర్ణానుగ్రహమునను, ఉద్రేక సమయమందలి సంకల్ప బలమునను, చూచుచుండగనే వ్యాధి పలాయిత మయ్యెను. ఇంతియ కాదు. ఈశత్రువుమీఁద సమగ్రవిజయ మీతరుణముననే నాకుఁ జేకూరెను. అప్పటినుండి నేఁటివఱకు మరల నెన్నఁడును నేనీ రుగ్ణతబారిఁ బడలేదు.

ఇంగ్లీషులో మొత్తముమీఁద నేను బాగుగ వ్రాసినను, ఆంధ్ర సాహిత్యమునందు ప్రశ్నలు మిగుల కఠినముగ నుండుటచేత, నే నందపజయ మొందుదు నని భయ మందితిని. కాని, నాస్నేహితులు సాంబశివరావు నరసింహరాయఁడుగార్లవలె నేను పరీక్షలోని రెండవ భాగమును వదలిపెట్టక, మఱువారమునం దాపరీక్షకుఁగూడఁ బోయితిని. 25 వ జనవరినాఁటితో నా పట్టపరీక్ష పూర్తి యయ్యెను. ఆ సాయంకాలమున వ్యాయామమున కొకమిత్రునితోఁ బోయి, గుజిలీ బజారు చూచి, అచట నొకపుస్తకము కొని తెచ్చికొంటిని. ఐనను, నేను పూర్తియగు విరామము నాలుగుదినము లైన ననుభవింప నోఁచు కొననైతిని! సైదాపేటలోని బోధనాభ్యసనకళాశాల యదివఱకె తెఱచిరి. అందుఁ జేరి, యల్. టి. పరీక్షకుఁ జదువవలె నని మృత్యుంజయరావు నేనును ఉద్యమించుకొంటిమిగదా. ఆమఱునాఁడె మేము