పుట:2015.373190.Athma-Charitramu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 182

మేము పరీక్ష నిమిత్తమై చెన్నపురి బయలుదేఱవలసిన దినములు వచ్చెను. ఆ సమయమునందు, నామీఁద గల వైరభావము స్నేహితులు వెలిపుచ్చ నారంభించిరి. వీరలలో నగ్రేసరుఁడు నా మిత్రుఁడు మృత్యుంజయరావె యగుటకు నే నెంతయు వగచితిని. ఇట్టి స్వభావము గలవారితోఁ జెలిమి చేసి, యేల నే నీసమాజమునఁ బని చేసితినని విచారించితిని. నేను చెన్నపురికిఁ బోవునపుడు సెలవు గైకొనుటకు వీరేశలింగముగారియొద్ద కేగఁగా, ఆయన మా యంత: కలహముల సంగతి విని, స్నేహితు లందఱిని సమావేశపఱచి, మాలో మరల మిత్రభావము నెలకొల్పఁ బ్రయత్నించిరి. వారిమాటలు శిరసావహించి మే మందఱమును వారి హితవచనముల చొప్పున మెలఁగ వాగ్దానము చేసితిమి. ఇపు డందఱము కూడి ప్రయాణము చేయ సమ్మతించుటయె యీ స్నేహ పునరుద్ధరణమునకు సూచన.

42. సౌఖ్య దినములు

రోగములు, మనస్పర్థలు, మున్నగు శోధనల కెంత లోనైనను, 1892 వ సంవత్సరమున తుదియాఱు నెలలును నాకు నా స్నేహితులకును విద్యార్థిదశలో నెల్ల సుఖతమదినము లని చెప్పవచ్చును. మిత్రుల మందఱమును గలసియుండెడి యా యిల్లపుడు రాజభవనము వలె నాకును నా స్నేహితులకును గానఁబడియెడిది ! ముఖ్యముగ సంఘసంస్కరణాభి మానుల కది యాటపట్టయ్యెను. అచటినుండి వీచుగాలియె సంస్కరణాభిమానబీజములను నలుదెసలకును వెదచల్లు నటు లుండెను. సంస్కరణమును గూర్చి చర్చలు, ప్రసంగములు, సంభాషణములును, ఎల్ల సమయములందును, అచట వినవచ్చు చుండెను. సంస్కరణమును గూర్చిన పత్రిక లచటఁ జదువరులకు లభ్య మగు