పుట:2015.373190.Athma-Charitramu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

41. వైరివర్గము 181

పత్రిక విషయమై నా చదువు నాకాలము నాయారోగ్యమును ధారవోయు నన్ను గుఱించియె మిత్రులు సందియము లందుచుండుటకు విస్మయ మందితిని. సత్యసంవర్థనికి మాఱుగా వచ్చెడి పత్రికలు సభ్యుల కందఱికిని బంపుచు వచ్చినచో వారి మనస్సులు కొంత శాంతించు నని కనకరాజు ఆలోచన చెప్పుటచేత, అట్లు పంపుచువచ్చితిమి. కాని, పత్రిక పనులు చేయుటకు నెలకు రెండుమూఁడు రూపాయిల జీతముమీఁద నేర్పడిన యొకపిల్లవాఁ డొకఁడె యీపనిని నిర్వహింపవలసివచ్చుటచేత, క్రమముగ పత్రిక లందఱికిని నందకుండెడివి. సమాజము యొక్క నౌకరుచేత నే నింటి చాకిరి చేయించు కొనుచు, వాని నితర సభ్యుల పరిచర్యలకు వదలకుంటి నని సభ్యుల మొఱ ! దీనిలోఁ గొంత సత్యము లేకపోలేదు. ఏయుద్యోగ సంబంధ మైన జవానుగాని పరిచారకుఁడు గాని యా యుద్యోగి యింటఁ గనఁబడుటయె తడవుగా, ఆడంగుల నియామకమున నాతఁడు ఇంటి నౌకరుగఁ బరిణమించుచున్నాఁడు ! ఇట్టిపనులు వానికి నియమించుట కూడని పనియె యైనను, ఏయుద్యోగి తనభార్యమీఁదను బిడ్డలమీఁదను అహర్నిశమును ఈచిన్న సంగతిని గూర్చి యుద్ధము సలుపఁగలఁడు? ఇది కారణముగ, ఆకాలమున నేను స్నేహితుల సుముఖత్వమును గోలుపోయితిని. సహనబుద్ధియు కార్యవాదిత్వమును బూని, పరిస్థితుల కెటులో సరిపెట్టుకొని, స్నేహసఖ్యములె యన్నిటికంటె ప్రధాన మని గ్రహించి, సమభావమున మెలంగుటకు, మే మెవరము గాని వయసు మీఱిన యనుభవ శాలులము గాము. స్వల్పవిషయము లందె గొప్ప పట్టుదలలు గల బాల్యావస్థయందె మే మెల్లరము నుండుటచేత, మా సమాజసభ్యులలో నిట్టి ద్వేషభావములు క్రమముగఁ బెరుఁగజొచ్చెను.