పుట:2015.373190.Athma-Charitramu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 174

ర్థులు కొందఱితోఁ గలసి, విద్యాలయమునకుఁ జేరువ నుండు నొక మేడను అద్దెకుఁ దీసికొంటిమి. నాచదువున కందు నిశ్శబ్దమగు గది యొసఁగబడెను. చుట్టుపట్టుల నిండ్లలో నివసించియుండు కనకరాజు మృత్యుంజయరావు మున్నగుస్నేహితులు తఱచుగ మాబసకు వచ్చి, మాతో సంభాషించుచుందురు. మృత్యుంజయరా విపుడు కళాశాల చేరి పట్టపరీక్ష రెండవభాగమునకుఁ జదువుచుండెను. ఇపుడు కనకరాజు పట్టపరీక్ష మొదటితరగతిలోఁ జేరి, యెక్కువ విశ్రాంతి గలిగియుండుటచేత, పత్రికవ్యవహారము లతఁడు చూచుచువచ్చెను. చదువుకొనుటకు ప్రత్యేకవసతి యేర్పడుటచేత, ఆఱునెలలలో రానున్న పట్టపరీక్షకై కృషిసలుప నుద్యమించితిని. కాని, నా యారోగ్య మింకను సరిగ లేదు. ఆదినములలో రోగము నాదేహముతో 'సెలగాటము' లాడుచువచ్చెను ! ఆతరుణమున నామిత్రులు కొందఱు నాకు సాయము చేసిరి. రామారావుగారు ఉపహారములు చేయించి పెట్టుచును, మృత్యుంజయరావు అపుడపుడు భోజనసదుపాయము లొనరించుచును, రంగనాయకులునాయఁడుగారు ఔషధపానీయముల నంపుచును, నా కెంతయో తోడ్పడిరి.

ఇంట భోజనవిషయమున మాతల్లి యెన్నియో సదుపాయములు నాకు సమకూర్చుచుండెడిది. అప్పుడప్పుడు జబ్బుపడుచుండినను, మొత్తముమీఁద మాయింట నుండునందఱిలోను సుఖానుభవమున నేనే యధిపుఁడను ! చదువుకొనుటకు శయనించుటకును నాకు విశాలమును నిశ్శబ్దమునునగు ప్రత్యేకమగు మేడగది కలదు. వర్ష కాలమున మా కుటీరనివాసము కడు బాధాకరముగ నుండెడిది. ఆపర్ణశాలలో నేల మిగుల తేమగును, పెరడు బురదగను నుండుటవలన, అహర్నిశ మచట తిరిగి పనులు చేసికొనుచుండు మాతల్లికిని తక్కిన యాఁడు