పుట:2015.373190.Athma-Charitramu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 170

కొందఱును పట్టుదలతోఁ బనిచేసిరి. ప్రార్థనసామాజికులకు పూఁటకూళ్ల యిండ్లలో రెండుదినములు భోజనము దొరకకుండఁ జేసిరి. అంత, కనకరాజు నేనును కళాశాలాధ్యక్షుని దగ్గఱకుఁబోయి, ఉపాధ్యాయుల కుట్రను వారి కెఱిఁగించితిమి. ఆయన మాకుఁ దోడుపడెద నని చెప్పి, ఆయుపాధ్యాయులను వారించెను. బహిష్కరణప్రమాద మంతట మెల్ల మెల్లగఁ దొలఁగి పోయెను. కాని, ప్రార్థనసమాజ శత్రుల యీర్ష్యారోషము లింతటితో నస్తమింపలేదు. 11 వ ఏప్రిలు తేదీని "రాజమంద్రి యందలి ప్రస్తుత పరిస్థి"తుల ను గూర్చి యొక న్యాయవాది పురమందిరమున నుపన్యాస మిచ్చెను. వాదప్రతివాదనల తీవ్రతచేత సభ యల్లకల్లోల మయ్యెను. ఆసమయమున మిత్రుఁడు కనకరాజు చేసిన యప్రస్తుత ప్రసంగమునకు స్నేహితులము వానిని నిందింపఁగా సమాజము వదలివేతు నని యాతఁడు చెప్పివేసెను గాని, పాపయ్యగారి శాంతవచనములచే మనస్సు మార్చుకొనెను.

నా పూర్వమిత్రుఁడగు మహమ్మదు బజులుల్లా సాహేబు, ఒక బ్రాహ్మణ స్నేహితునితోఁ గలసి యిపుడు "సత్యాన్వేషిణి" యనునొక యింగ్లీషు వార్తాపత్రికను నెలకొల్పెను. దాని మొదటి సంచిక 12 వ ఏప్రిలున వెలువడెను. మతసాంఘిక విషయములు చర్చింప నుద్యమించిన యీతోడి మాసపత్రికకు ఏప్రిలు సంచికలో సత్యసంవర్థని సుస్వాగత మిచ్చెను గాని, సంస్కరణ నిరసనమే ముఖ్య కార్యముగఁ జేసికొన బయలువెడలిన యీనూతనపత్రికకు మాకును ముందు పోరు ఘోరముగ జరుగు నని మేమెఱిఁగియే యుంటిమి.