పుట:2015.373190.Athma-Charitramu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38. సంరంభము 169

"అవును. పంతులుగారు పత్రికాధిపత్యమందును మాకు నాయకులే !" అని నాసమాధానము.

ఈసంభాషణ జరిగిన యొకటిరెండురోజుల కీసావాసుఁడు మరల నాకుఁ గనిపించి, మానరక్షణమును గుఱించి వేశ్య వ్యాజ్యెము తెచ్చుట మానుకొనె నని చెప్పెను. కారణ మడుగఁగా, వెనుకటిసారి నాతో నతఁడు మాటాడునపుడు, ఆవేశ్య నాగదిప్రక్కగదిలో నిలుచుండి సంభాషణ యంతయు విని, పెద్దపులివంటి వీరేశలింగము పంతులే యీవ్యవహారములో నుండుటచేత, తనయాటలు సాగవని భీతితో నుద్యమము విరమించుకొనె నని చెప్పెను ! వేశ్యాజన ప్రియుఁడగు నా యీ పూర్వసహచరుఁడే, ఆ స్త్రీ యాప్రక్కగదిలోనికి వచ్చిపొంచుని వినునట్టి యేర్పాటు చేసేనట !

సత్యసంవర్థనీ పత్రికాధిపతిమీఁదను, ప్రార్థనసమాజముమీఁదను జనులకుఁ గొందఱికిఁగల యాగ్రహ మింతటితో నంతరింప లేదు. 19 వ మార్చితేదీని పురమందిరమున జరిగిన నాటకసందర్భమున, ప్రహసనములో ప్రార్థనసామాజికులు పత్రికాధిపతియును వెక్కిఱింపఁబడిరి. ఇది జరిగిన కొలఁదిదినములకే ప్రార్థనసమాజవార్షి కోత్సవము జరిగెను. ఏఁటేఁటను, ఈ సందర్భముననే ప్రార్థనసమాజమువారిని వెలివేయుటకు యత్నములు జరుగుచుండెడివి. పూర్వాచారపరులకు మామీఁద నిపుడు పూర్తిగ నాగ్రహము గలిగెను. ఉత్సవదినములలో నన్నదానమునకై వంట చేయుటకు బ్రాహ్మణులు రాకుండఁజేయు ప్రయత్నములు జరిగెను. వంటపందెర మీఁద రాళ్లు రువ్వఁబడెను. సారంగధరుని మెట్టమీఁద ఫలాహారములు చేసిన వారిని వెలివేయుట కిపుడు ప్రయత్నములు సాగెను. ఈసందర్భమున పూర్వాచారపరులను బురికొల్పుటకు కళాశాలోపాధ్యాయులు కొందఱును వారి శిష్యులు