పుట:2015.373190.Athma-Charitramu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 168

కొందరును, నిర్వ్యాపారులై కాలమువ్యర్థపుచ్చు మరికొందరును, మనయెదుటనే యెన్నియో సంసారముల గూలద్రోచి, ప్రస్తుతము కోరలు పెరికిన వృద్ధకాలసర్పమువలె నున్న ఒకవేశ్యాకాంతయొక్క ముద్దుకూతురిచే గజ్జె కట్టించిరి. కామశాస్త్రోపాధ్యాయి యగు ఆమెయు తనగాత్రముయొక్క అభివ్యక్తిచేతను, నేత్రవిలోకములచేతను, అభినయముచేతను, పాడినగీతముల దుర్నీతులచేతను, 'బ్రదుకుదినముల మోక్షంబు వెదుక నేల ?' అను మృగధర్మమును వారిమనస్సులకు నాటునట్లు బోధించి చెనెను. పామరజనులను సన్మార్గమునకు పురికొల్పవలసిన పట్టపరీక్షావిద్యార్థులే కులటల నాదరించుచున్నపుడు, మనదేశ మెప్పు డున్నాతస్థితికి వచ్చునో తెలియకున్నది."

ఈవార్త పత్రికలోఁ బ్రచురించినందున కనేకులు నన్ను నిందించిరి. సభకు వెళ్లిన విద్యార్థులు కొందఱు రోషపడిరి. తమ్ము నవమానించినందుకు నామీఁద నభియోగము తెచ్చెద మని కొందఱు భయపెట్టిరి. నామీఁద వ్యాజ్యెము తెమ్మని యా వేశ్యను కొందఱు పురికొల్పిరి. నామూలమునఁ దామును జిక్కులలోనికి వచ్చెద మని సమాజమిత్రులు కొందఱు భయపడిరి. తమ లేఖామాతృకను దమ కిచ్చి వేయుమని భీతిల్లిన లక్ష్మీనారాయణగారు నన్ను వేఁడిరి. నే నది యిచ్చివేసితిని. ఒకనాఁడు నాపూర్వసహచరుఁ డొకఁడు నాగదిలోనికి వచ్చి, "ఈసత్యసంవర్థనీపత్రికను నడపువారు, మీవిద్యార్థులే కాక, మీనాయకుఁడు వీరేశలింగముపంతులుకూడను కాదా ? పత్రికాధిపత్యమునందు ఆయనకును బాధ్యత యున్నదికాదా ? " అని నన్నడిగెను. ఆయనకూడ పత్రికాధిపత్యమున భాగస్వామియే యని నే జెప్పితిని. "పెద్దవారగు పంతులుగారియాలోచన పుచ్చుకొనియే మీరీపత్రిక నడుపుచున్నారుకాదా ?" అని నాసహచరునిప్రశ్న.