పుట:2015.373190.Athma-Charitramu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

37. చెన్నపురి స్నేహితులు 163

మయ్యెను. కుటుంబ సాంఘికపరిస్థితుల వ్యత్యయముచే రంగనాయకులునాయఁడు మతాంతరుఁడు కానొల్లక యుండినను, నిజమతవిశ్వాసములను దాఁపఱికము లేక స్నేహితుల కెఱిఁగించి, హిందూసంఘ సంస్కరణపరాయణుల యెడల పరిపూర్ణసానుభూతి చూపెడి విశాల హృదయుఁడు. నారాయణస్వామినాయఁడు తన విశ్వాసముల చొప్పున నడచుకొనుట కావంతయు వెనుదీయకుండెడి ధైర్యవంతుఁడు. సంస్కరణాభిరతులయెడ నీయనకును అభిమాన ముండినను, తాను నమ్మిన సత్యక్రైస్తవదీక్ష నెల్లరు నేల గైకొన రని యాయన సంప్రశ్నము. క్రైస్తవమతావలంబనమే మానవులకు మోక్షప్రదాయకమని యాయన మనసార నమ్ముచుండువాఁడు. రంగనాయకులునాయఁడు నిరంతర మందహాసమున నొప్పెడి ప్రశాంతచేతస్కుఁడు. నారాయణస్వామినాయఁడు కాపట్య మెఱుఁగని కోపస్వభావుఁడు. బాలకునివలె సహృదయుఁడై, బాలకునివలెనే తాత్కాలి కాగ్రహాది భావోద్రేకాదులకు వశవర్తి యగుచుండును. మనసు గలసిన మిత్రునికి వలసిన సాయము చేయుట కీయన వెనుదీయకుండువాఁడు. అన్న యన్ననో, తమ్మునకుఁ దీసిపోని నైసర్గికసౌజన్యమునఁ జెలంగుచుండియు, పరిస్థితుల వై పరీత్యమునకుఁ జెక్కుచెదరని శీలసమత్వమునఁ జెన్నొందెడి శాంతమూర్తి. సుగుణోపేతులగు నీసోదరుల యరమరలు సవరించి, యిరువురికి సామరస్యము నొడఁగూర్ప నే నానాఁడు ప్రయత్నించితిని.

చెన్నపురిలో నీమాఱు నాకు లభించిన మిత్రు లింకొకరు శ్రీ వెంకటరత్నము నాయఁడుగారు. ఈయన యప్పుడే యమ్. యే. పరీక్ష నిచ్చి, పచ్చప్పకళాశాలలో నుపాధ్యాయుఁడుగ నుండెను. సునిశిత బుద్ధివికాసమునకును, ఆంగ్ల సారసత్వమున పాండిత్యగరిమమునకును,