పుట:2015.373190.Athma-Charitramu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 160

రానివాఁ డనఁగఁ దెలియక తల్లడిల్లుచుండిరి. యజమానుని చిన్న కొమరితకు, ఆపదమున కర్థము తెలియకుండెను. భోజనసమయమునఁ జెప్పరానివానినిగుఱించి విప్పిచెప్పుట తప్పిద మని దానిని తండ్రి వారించెను. యజమానుని మాటలనుబట్టి యా చెప్పరానివాఁడు "చెప్పఁదగువాఁడే" యని లేకరి తలంచినను, తా నాయనతో వాదమునకు డీకొనినచో కృతఘ్నుఁడ నయ్యెద నను భయమునను, సందియము లొకటికి రెండై బాలిక రొదచేయు ననువెఱపునను, ఆతఁ డూరకుండెను ! భూత దయాదిసుగుణముల కాకరమగు నగ్రకులమువారు హీనవర్ణజులను భోజనసమయమునఁ దలపెట్టనేకాడదా ? పేరు పెట్టినను లేకున్నను, మనోనేత్రమునెదుటఁ గానిపించునది వ్యక్తియొక్క యాకారమేకదా ! జాతికంటె నీతియే ప్రధాన మైనచో, గుణవంతుఁడైన యీచెప్పరానివాఁడు చెప్పఁదగువాఁడే కదా? - ఇదియే యా లేఖాసారము.

"చిత్తము శివునిమీఁదను భక్తి చెప్పులమీఁదను" అను నట్టుగ, ఆకాలమున నా యాంధ్రవ్యాసరచనము విచిత్రద్వంద్వవిధానము నను సరించుచుండెడిది ! భావకల్పనము ఆంగ్లమునను, వాగ్విధానము ఆంధ్రమునను జరుగుచుండెడిది. కాని, యింగ్లీషులో వ్రాయునపుడు, నా కీకష్ట మెంతమాత్రమును గనిపించెడిదికాదు. ఆంగ్ల సాహిత్యము ప్రథమమునుండియు నా యభిమానవిద్యా విషయము. మొదట కొంత భీతి జనించినను, నా గురువర్యులగు స్కాట్ దొరగారు నా వ్యాసములు దిద్దుచుండుటవలన, నా కచిరకాలముననే బెదరు తీఱి, ఆంగ్లమున బాహాటముగఁ గలము సాగుచువచ్చెను. పూర్వోదాహృతములగు నాంగ్ల వ్యాసములు గాక నేను ప్రథమసంపుటమున, "మత మననేమి" "విశ్వాసహీనత" "పవిత్రప్రేమము" "బహుత్వముననేకత్వము" "భక్తిమాధుర్యము" అను మకుటములుగల వ్యాసములు వ్రాసితిని.