పుట:2015.373190.Athma-Charitramu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36. సత్యసంవర్థని 159

జెక్కినవానికిని గలభేదములు, కనులు గలవారి కెవరికి గోచరింపవు? రెండవసంచికలో పంతులుగారు "ఈశ్వరచంద్రవిద్యాసాగరు" లను గూర్చియు, నేను "పరోపకారము"నుగుఱించియు వ్రాసితిమి. మూఁడవ సంచికయందు పంతులుగారి "సౌదామినిరాయి"యు, నావిరచితమగు "సత్యము"ను గానవచ్చెను. ఇవిగాక, ఆసంపుటమున నిఁక రెండుమాఱులే తెలుఁగువ్యాసములు నేను వ్రాసితిని. అవి 5 వ సంచిక యందలి "శరత్కాలము", 7 వ సంచికలోని "మిత్రత్వము"ను. వీనియన్నిటిని బరిశీలించినచో, నే నెట్లు ఇంగ్లీషువ్యాసముల యొరవడిని గైకొని, భావముననే కాక, భాషావిషయమునఁగూడ, ఆంగ్ల సంప్రదాయముల ననుకరించుచుంటినో తెలియఁగలదు. 'మీఁగాళ్లవాఁపు మొగమే తెలుపు' ననునట్టుగ, నావ్యాసముల మొదటివాక్యములే వాని యన్యభాషాసంప్రదాయాను సరణమును వెల్లడించుచున్నవి !

ఏదో యొకయింగ్లీషుమాతృకను గైకొనియో, కల్పన చేసికొనియో, ఆంగ్ల భావములను, ఆభాషాసంప్రదాయముల ననుసరించి యాంధ్రవ్యాసము లల్లుటకంటె, తోఁచినవిషయము చేకొని, యిచ్చవచ్చినచొప్పున తెలుఁగు వ్రాసియుండినచో, నా కలము బాగుగ సాగి పోయెడిది. 3 వ సంచికలో "సత్యవాది" పేరు పెట్టిన జాబు నే వ్రాసినదియే. అది పంచమజాతిసమస్యను గుఱించినది. లేకరి గ్రామాంతరము పోయి తిరిగి వచ్చు నపుడు, ఒకబ్రాహ్మణుని యింట భోజనము చేసెను. భోజనసమయమందు, ఇంటియజమానునికొఱ కెవరో వచ్చి వీథిలో నిలుచుండి రని తెలిసెను. వాఁడు చెప్పరానివాఁ డనిగృహిణి పలికెను. అపు డా చెప్పరానివాని గుఱించి యజమానుఁడు లేకరితో ప్రస్తావించుచు, అతఁడు తమ పాలేరనియు, విశ్వసనీయుఁ డనియుఁ బలికెను. ఈసంభాషణసమయుమునందు, ఇరువురు శ్రోతలు చెప్ప