పుట:2015.373190.Athma-Charitramu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 152

గతిలో నెచటనైనఁ గూర్చుండవచ్చును గాన, నే నాతనిప్రశ్న కాశ్చర్య మందితిని. కాని, హీనజాతివాఁడ నని మిత్రులు తన్ను హేయముగఁ జూచి, తమదరిఁ జేరనీయకుండి రని యతనివలన విని, నా కమితమగు కోపము వచ్చెను. తరగతిలో ననేకులు జాతిభేదములు పాటింప మని చెప్పుకొను ప్రార్థనసామాజికులు. వీ రిట్లు సంకుచితభావములతో నీతనిపట్ల మెలఁగుట నా కాశ్చర్యవిషాదములు గలిగించెను. తెలివిగలవాఁడును, తెలుఁగులో నందఱికంటె మిన్నయును నగునీసహచరు నిట్లు అవజ్ఞ చేయుట తగదని నేను రెండుమూఁడు మాఱులు స్నేహితులతో నొక్కి చెప్పఁగా, వారొకరిమొగ మొకరు చూచుచుండిరే కాని, తమనడవడికి విచారపడలేదు ! అందువలన నావిషాదము మఱింత హెచ్చెను. ఎక్కువచనవుగల యొకమిత్రుఁ డంత మెల్లగ నాతో, "నీకుఁగల సోదరభావము మాకును లేకపోలేదు. కాని, గోమాంసభక్షకుఁడైన యాతఁడు చెంతఁ గూర్చుండు నపుడు మే మచట నిలువఁజాలము !" అని పలికెను. ఈతని మాటలలోఁ గొంత సత్యము లేకపోలేదు గాని, తమతో సమానునిగఁ జూచెడి నలుగుర మధ్య మెలఁగ నవకాశ మున్నప్పుడే యట్టియువకుఁడు ఎక్కువ శుచి శుభ్రములు గలిగి, ఎక్కువజాగ్రతతో సంచరింపఁగలఁ డని నేను నమ్మి, పంచమసహాధ్యాయుని ప్రేమించువాఁడను.

కళాశాలయొద్దనుండు కొట్లలో నే నెఱిఁగిన యొక పూఁట కూళ్ల ముసలమ్మను చుట్టుపట్టుల నుండు విద్యార్థులు, "జలపాత" మని పేరు పెట్టి, వేధించుచుండి రని నాకు వినవచ్చెను ! విద్యాధికులును, ప్రార్థనసమాజికులును గూడ నిట్లు చేయుటకు నే నెంతయు వగచితిని. ఇట్టిసహాధ్యాయులఁ గొందఱి నొకచోటికి నేను బిలిచి, విద్యాధికు లగువారు తమబాధ్యతలను గుర్తింపక, దిక్కులేని పేద