పుట:2015.373190.Athma-Charitramu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 148

డగు వేంకటరత్నము ఇన్నిసుపేటపాఠశాలలోఁ జేరి చదువుచుండెను. పుత్రికలలో నీడు వచ్చిన పెద్దకొమార్తె గాక, తక్కినయిద్దఱును బాలికాపాఠశాలలో నిపుడు చదువుచుండిరి. సంబంధబాంధవ్యము గలిసిన యీరెండుకుటుంబముల వారును, ఇపు డేకపట్టణవాస్తవ్యులై, ఒకరి స్థితిగతులు, గుణగుణములు నొకరు బాగుగ గ్రహించి, స్నేహవిరోధములు లేని తటస్థభావమున మెలంగుచుండిరి.

నేను చెన్నపురినుండి యింటికి వచ్చిన కొలఁది దినములకే నాభార్య కాపురమునకు వచ్చెను. వసియించుటకు విశాలమగు గృహమును, వాడుకొనుటకుఁ బుష్కలముగ ధనమును లేని క్లిష్టపరిస్థితులలో, క్రొత్తకోడలికాపురము కష్టతరముగనె యుండును. పదమూఁడేండ్లు నిండని యావధువుకోమలహృదయము నిపుడు గాకుచేసినది, పరిస్థితులవ్యత్యయము గాక, పతి విపరీతసంస్కరణాభిమానకథనమె! ఇప్పటికంటె నాకాలమున విద్యావంతుఁడగు భర్తకును విద్యావిహీన యగు భార్యకును గల యంతర మధికముగ నుండెను. తనపతి జనసమ్మతము గాని సంస్కరణాభిరతుఁ డనియు, సంఘబహిష్కృతుఁడైన వీరేశలింగముపంతుల ప్రియశిష్యుఁ డనియు నందఱు చెప్పుకొనునపుడు, పూర్వమె బాలసతి కలజడి గలుగుచుండెడిది. వెనుక వీనుల వినినదాని కంటె నిపుడు కనులఁ గాంచిన విశేషములు మిగుల కష్టముగనుండెను? ఆతఁడు విపరీతమతసాంఘికాదర్శప్రియుఁ డగుటయె కాక, ఏపాప మెఱుంగని యాపడఁతికి సంకరధర్మములు బోధించి, వానిని విశ్వసింపుమని నిర్బంధించుచున్నాఁడు! పాప మాబాలిక యేమి చేయఁగలదు? పూర్వాచారపరులగు పెద్దలమార్గ మవలంబింపవలయునా ? ప్రాచీన సంప్రదాయవిరోధియగు పతియడుగుజాడల నడువవలయునా ?