పుట:2015.373190.Athma-Charitramu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 140

నుండెడివి. ఇట్టి వాక్శక్తి లోపమువలన, హృదయమున లేని కాఠిన్యమునకును, మనసున లేని కాపట్యమునకును, నేను ఉత్తరవాది నగుచు వచ్చితిని.

నిశబ్ద మగుచోటఁ గూర్చుండి కలము చేతఁ బట్టినప్పుడు, ఉపన్యాసవేదికమీఁదను సభామధ్యమునను నాకుఁ గానవచ్చెడి తొట్రుపాటులు తొలఁగిపోయెడివి. భావమును వ్యక్తపఱిచెడి భాషయు, అభిప్రాయముల కనువగు పదసంఘటనమును, వ్రాఁత లభింపఁజేసెడిది. కలము చేతఁ బూనినపుడు, అవమాన మేమియుఁ గలుగకుండ మన తలంపులు మనము మార్చుకొనవచ్చును. మిత్రుల పరిహాసములకును, వైరుల వ్యాఖ్యానములకును నెడ మీయకుండ వెనువెంటనే మన వాక్యములు మనము సరిచేసికొనవచ్చును. కావున నన్ని విధములను వ్రాఁతపనియె నాకుఁ గర్తవ్యముగఁ గానఁబడెను.

32. పత్రికాస్థాపనము

"సత్యసంవర్థని"ని బ్రచురింప వీరేశలింగముగారు మిత్రులును సమ్మతించిరి కాన, ఆ పత్రికాస్థాపనవిషయమై వలయు ప్రయత్నములు నేనంతట చేసితిని. "వివేక వర్థనీ"పత్రికకు వెనుకటి వ్యవహారకర్త యగు శ్రీరాములుగారితో నేను జూలై 2 వ తేదీని కలసి మాటడఁగా, పత్రికను నడుపురీతిని నా కాయన చెప్పి, తానే యాపని చేసిపెట్టెద ననెను. పత్రికను టపాలో నంపువిషయమై మాటాడుట కానాఁడె నేను టపాలాకచ్చేరికిఁ బోయితిని. సబుకలెక్టరువొద్ద కేగి, నేను "సత్యసంవర్థనీ" పత్రికాప్రచురణకర్త నని కాగితముమీఁద సంతకముచేసి వచ్చితిని.