పుట:2015.373190.Athma-Charitramu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

31. రచనావ్యాసంగము 139

తాపము" అనువ్యాసము నే నీసమయమున రచించి, సవరించి, పత్రికకు సిద్ధపఱిచినదియె.

నూతన పత్రికా వ్యాసంగమున నే నిట్లు తనిలియుండుటకుఁ గారణమారయఁగా ఆనాఁటి నామనస్తత్త్వ సమాచారము నాకు స్ఫురణకు వచ్చుచున్నది. నాశరీరదౌర్బల్యము సంగతి మాటిమాటికి నా మనస్సున కింకను దట్టుచు, నాబాధలను బెనుచుచుండెను. ఈ బాధలు నే లెక్క గొనక మఱచిపోవుటకు, నామనస్సున కపుడు నిరంతర పరిశ్రమ మేదియో యొకటి యావశ్యక మయ్యెను. ప్రార్థన సంఘ సంస్కరణ సమాజ ప్రణాళికలు నామనసున కట్టి వ్యాసంగము కొంత గలిపించినమాట వాస్తవమే. కాని, సమాజసభలు వారమున కొకటి రెండు గంటలు మాత్రమే జరుగుచుండెను. సభాప్రసంగము లందును, సఖులతో సంభాషణమునందును, ఉపన్యాసాదుల యందును నేను దఱచుగఁ బొల్గొనుచుండెడివాఁడను. కాని, యిట్టి చర్య లనుదినమును జరుగుట కవకాశము లేదుగదా.

ఇదిగాక, ఉపన్యాసములు, వాదోపవాదములును నా కంతగ రుచెండివికావు. మీఁదుమిక్కిలి నా సంస్కరణ వ్యాపనమునకుఁ గూడ నివి కొంత ప్రతిబంధములని నాకుఁ దోఁచెను. వ్యాసరచనయు పత్రికావిలేఖనమును ముఖ్య కర్తవ్యములుగ నా కగఁబడెను. దీనికి హేతువులు లేకపోలేదు. తగినంత వేగముగను విస్పష్టముగను సభలలో నేను నా భావములను వ్యక్తపఱుప లేకుండెడివాఁడను. తెలుఁగున మాటాడునపుడు ఇంగ్లీషుపదములు దొరలుచుండెడివి ! భావోద్రేరమున నా వచోధోరణి కుంటుచు నడుచుచుండెడిది. పదలాలిత్యాది సొంపులు లేక, నాభాష పరుషముగను, పలుకులు కటువులుగను