పుట:2015.373190.Athma-Charitramu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30. జనకుని వ్యవహారదక్షత, శకటవ్యాపారఫలితము 135

రానున్న దని యన్నదమ్ములు గుసగుసలాడుకొనిరి ! ఇంకను విరివిగా నీవ్యాపారము సాగించినచో, సులభముగ వందలు వేలును లాభము మూటగట్టవచ్చు నని యాసోదరులు తలపోసిరి. అంత మా జనకుఁడు సొంతచేతులతోనే యాచింతపండు తూఁచి యమ్ముటకు తక్కెడయు రాళ్లును తయారు చేసికొనెను !

గాలిపాటువలె వర్తక పరిస్థితులును నిముసనిముసమును పరివర్తన మందుచుండును ! మఱునాఁటినుండియె చింతపండుధర తగ్గసాగెను, పూర్తిగ లాభము తీయవలయు ననుపేరాస ప్రేరింపఁగా, మాతండ్రి కాలానుసారముగ కొంతధర తగ్గించి, తా నెటులో సరకు నమ్మివేయుటకు సమ్మతింపలేదు. రానురాను చింతపండు చౌక యైపోయెను. స్వల్పలాభమునకో నష్టమునకో సకాలముననే సర కమ్మలేనివారు, అది కారుచౌక యగునపుడు, ఎక్కువనష్టమునకు తెగించి యమ్మివేయఁ గలరా? పర్యవసాన మేమన, మా నాయన తెచ్చినచింతపండుబుట్టలు, తెచ్చినవి తెచ్చినట్టుగనే నిలువయుండి, పదు నుడిగి, బూజు పట్టి, గడ్డగట్టిపోయినవి ! ఇపు డవి యెవరికిఁ గావలెను? ఇంట నైన నుపయోగింప వలనుపడకుండెను. మావాండ్రు నీళ్లపొయిలో చింతపండు అడలు వేయుచుండువారు ! శీతకాలమందు ప్రొద్దున చలిమంటల కివి యుపకరించుచుండెను. మంట యారిపోవ నున్నపు డెల్ల, "ఇంకొక అడ తెచ్చివేయండిరా !" అనుమాటలు చిన్న నాఁడు నేను వినుచుండిన జ్ఞాపకము ! ఈచింతపండువ్యాపారప్రస్తావము తెచ్చి, మావాండ్రు, అప్పుడప్పుడు మాతండ్రిని పరియాచకము చేయుచుండువారు. అపు డాయన ముసిముసినవ్వులు నవ్వుచు నుండువాఁడు !

ఇపు డీబండ్లవ్యాపారము నటులే పరిణమించు నని నేను వాక్యము పెట్టితిని ! కాలము గడచినకొలఁది, బండ్ల'గిరాకి' తగ్గెను.