పుట:2015.373190.Athma-Charitramu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 122

28. పరీక్షావిజయము

1889, 91 వ సంవత్సరములమధ్య నా జీవితమునఁ గలిగినంత గొప్పపరిణామము, అంతకుఁ బూర్వమునఁ గాని, పిమ్మటఁగాని యింతస్వల్పకాలమున సంభవింపలేదని చెప్పవచ్చును ! ఇష్టవిహారము, నియమానుగుణ్యజీవితము, ఆస్తికమతావలంబనము, సంస్కరణాభిరతి, మొదలగు దోహదవిశేషములచే నావ్యక్తిలతిక వర్ధిల్లి వికసించెను. ఆయాపరిస్థితుల ననుసరించి నాశరీరమనశ్శక్తులు, ఒకప్పుడు కష్టములఁ గ్రుంగుచు, ఒకప్పుడు సంతోషమునఁ బొంగుచుచును, మెల్ల మెల్లఁగ నభ్యున్నతి గాంచుచుండెను. నా శీలప్రవర్తనములు వివిధశోధనలకుఁ దావలమై, క్రమక్రమముగ క్రమమార్గానుసరణమున ప్రవర్ధమాన మగు చుండెను. ఇపుడు నా మతవిశ్వాసములందు సుస్థిరతాదృఢత్వములు, ప్రవర్తనమున నిశ్చిత నీతిపథానుసరణమును, స్పష్టముగఁ గానవచ్చెను. ఈ నూతనవత్సరమున విద్యాభివృద్ధి, దేశాటనము, గృహస్థాశ్రమారంభము, వార్తాపత్రికాస్థాపనముల మూలమున నా లోకానుభవమునకు విశాలత సమకూడి, నా సంస్కరణాభినివేశము నవీనములును క్రియా పూర్వకములు నగుదారులు త్రొక్కుట కవకాశము గలిగెను.

1891 వ జనవరి 1 వ తేదీని, నూతనవత్సరప్రార్థనసమయ మందు నే నిట్లు తలపోసితిని : - "భగవానుఁడా ! నిరు డీనాఁడు నే జేసికొనిన నియమముల నేఁడాదిపొడుగునను నే నంతగ ననుసరింపనందుకు వగచుచున్నాను. ఈ క్రొత్త సంవత్సరమున నీ యీ నిబంధనల నవలంబింతు నని ప్రగల్భములు పలుకక, నీ పాదకమలసేవయె చేతునని నేను నిర్ధారించుకొనుచున్నాను."