పుట:2015.373190.Athma-Charitramu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27. పరీక్షలు 121

కేక లిడుచున్నను, జొన్నకంకులమీఁదఁ జివాలున వాలి, చంచువులతో గింజ లందుకొని చతురతతోఁ బరుగులిడు పక్షుల నవలోకించుచు, నే సాగిపోయితిని. ఆహా! శీతకాలవాయువు లెంత సుఖదాయకములు ! తన్నుఁ బరిశీలించెడివారి శ్రమకు ప్రకృతికాంత యెంతయుదారహృదయమునఁ బారితోషిక మొసంగుచున్నది !

15 వ తేదీనుండి మద్రాసు సర్వకళాశాలాపరీక్షలు ప్రారంభ మయ్యెను. ఎంత ప్రయత్నించినను కొన్ని రాత్రులు నాకంటికిఁ గూర్కు రాకుండుటవలన, పరీక్షాదినములలో నా దేహము మిగుల నిస్సత్తువఁ జెందియుండెను. నే నెటులో ప్రశ్నపత్రములకు సమాధానములు వ్రాసితిని. నే ననుకొనినంత బాగుగఁ గాకున్నను పరీక్షలో జయ మందుటకుఁ జాలినట్టుగ వ్రాసితి నని తలంచితిని. గణితమునందు నాకు గండము తప్పవలెను ! ఎటులో జయింపవచ్చు నని యాశించి యూరడిల్లితిని.

19 వ తేదీతో మాపరీక్షలు పూర్తియయ్యెను. మఱునాఁడె నాకు జ్వరము సోఁకెను. శాస్త్రి మున్నగు స్నేహితులు నన్నుఁ జూడవచ్చి, మంచిమందు పుచ్చుకొమ్మని చెప్పిరి కాని, గోల్డుస్మిత్తువలె నేను సొంతవైద్యము చేసికొనఁగోరితిని ! ఈ జ్వరము నాలుగైదు రోజులలో నెమ్మదించినను, నాకనుల కిపు డొక క్రొత్తరోగము ప్రాప్తించినటు లుండెను. కన్నులయెదుట ముత్యాలసరమువంటి చిన్న చుక్కలబారు కనపడ నారంభించెను ! కంటివైద్యము చేయించుకొన నే నపుడు వేగిరపడితిని.