పుట:2015.373190.Athma-Charitramu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 114

లను సమర్థించుచు, సంఘసంస్కరణవిముఖు లైయున్నారు. ఇట్టి యసభ్యస్నేహితులసహవాసమున నాయుత్తమాదర్శములు రిత్తవోవునని నేను వెతనొందితిని. !

15 వ తేదీని ఉదయమున పండితశివనాధశాస్త్రిగారు రాజమంద్రి వచ్చిరి. ప్రార్థనసామాజికులము వారికి సుస్వాగత మిచ్చితిమి. ఆయన సాధురూపము మృదువచనములు మాహృదయములనుఁ జూర గొనెను. ఆసాయంకాలమున పండితుఁడు పురమందిరమున "నూతన భారతదేశము, అందలి నూత నాశయములు" అనువిషయమునుగుఱించి యుపన్యాసము చేసెను. వారిప్రసంగమున నవీనభావములు వెల్లివిఱిసి ప్రవహించెను. భావోద్రేకమున నాకును గంగరాజునకు నాతరుణమున చక్షువులనుండి బాష్పజలము స్రవంతియై పాఱెను. సభానంతరమున గంగరాజు నన్నుఁ గౌఁగిలించుకొని, తన యభిప్రాయభేదములను నీటఁగలిపి కార్యసాధనము నాతోఁ గలసివచ్చెదనని చెప్పివేసెను ; మే మిరువురము నానందపరవశుల మైతిమి.

మఱునాఁడు కొందఱు స్నేహితులము శివనాథపండితుని సందర్శించి, పెక్కువిషయములను గుఱించి యాయనతో సంభాషించితిమి. ఆసాయంకాలము బ్రాహ్మసమాజవిధులను గుఱించి శాస్త్రిగా రుపన్యసించిరి. పురమందిర మానాఁడు ప్రేక్షకులతోఁ గిటకిటమను చుండెను. శివనాథపండితుని యుపన్యాస మతితీవ్రముగను చిత్తాకర్షకముగను నుండెను. అప్పుడు ముత్తుస్వామిశాస్త్రి భావోద్రేకపూరితుఁడై పండితునికిఁ బ్రణమిల్లి, తా నీమాఱు బ్రాహ్మమత మవలంబించితి నని చెప్పివేసెను !