పుట:2015.373190.Athma-Charitramu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 108

తయుఁ జేయకమునుపే, జీవిత ప్రథమ సోపానముననే, నాదేహము వ్యాధిపా లగుచున్నది ! నా విధికృత్యములు నెరవేర్పఁబూనినచో, ఈ దుర్బలశరీరము తుత్తునియ లైపోవునేమో గదా ! పరిశుద్ధవర్తనము వీడకుండ జరుపుకొనునటుల నా కనుగ్రహింపుము !"

26. పరీక్షాపూర్వదినములు

1900 అక్టోబరునెలలో ప్రథమశాస్త్రపరీక్షకుఁ బోవువారిని నిర్ణయించుటకు జరిగిన కళాశాలాపరీక్షలో, ఇంగ్లీషులో నేను బాగుగ వ్రాసినను, లెక్కలలో గుణములు నాకు కనీస మైనను రా లేదు. బజులుల్లాసాహేబు నాకంటెను తగ్గియుండెను. గణితమున తరగతిలో మే మిరువురము నధమాధములము ! అయినను క్రిందటి సంవత్సరపు పరీక్షలో నాతఁడు నేనును తరగతిలో క్రమముగ ప్రథమ ద్వితీయస్థానములం దుండుటచేతను, ఇప్పటిపరీక్షలోఁ దక్కిన యన్ని పాఠములందు మేము సరిగా నుండుటచేతను, మమ్ముఁగూడ పరీక్ష కంపిరి. అప్పటినుండియు నేను మఱింత శ్రద్ధతోఁ జదువుచుంటిని. నా నిత్యకార్యక్రమము వెనుకటివలెనే జరుగుచుండెను. వ్యాయామము, ప్రాత:స్నానము, ప్రార్థనము, మిత్రులతోడి గోష్ఠి - ఇవి కొన్నిమార్పులతో నిపుడును నా దినచర్యలోని యంతర్భాగములే. పరీక్ష సమీపించినకొలఁది చదువునకు ప్రాముఖ్య మిచ్చితిని.

కాని, నా శరీరారోగ్యము అసంతృప్తికరముగనే యుండెను. నే నెంత జాగ్రత్తతో నుండినను, అనుదినము నేదోబాధ వచ్చి మూలుగుచుందును. తలనొప్పి, నీరసము, అత్యుష్ణము, పైత్యప్రకోపము, మున్నగు బాధలు నాకు సన్నిహితబంధువులె ! వీని పీడఁ బడుచుండు నేనాకాలమున నెట్లు చదువు సాగించికొనుచు, సభల కేగుచు,