పుట:2015.373190.Athma-Charitramu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 102

మఱునాఁడు (20 వ తేది) మేము విజయేశ్వరమునుండి మరల వాడపల్లి పోయితిమి. ఏదైన పడవమీఁద ధవళేశ్వరము చేరుదమా యనుకొనుచుండఁగనే, రేవుస్టీమరు వచ్చెను. ఇపు డది మునిఁగిన పడవను తిరుగఁదీయఁగా పడవగదిలో నిరుకుకొని చనిపోయిన యొకస్త్రీ, ఆమెకొడుకు కూఁతురు నందు గానవచ్చిరి! ఆశవములు చూచి యందఱమును దైన్యము నొందితిమి. మే ,మంత స్టీమరుమీఁద రాజమంద్రి వెళ్లితిమి.

ప్రియపట్టణమగు రాజమంద్రిని నేను మరల సందర్శించుట కమితానందభరితుఁడనైతిని. సంస్కారప్రియుఁడగు మిత్రుఁడు రాజగోపాలరావు నన్నుఁ జూచుటకు స్వగ్రామమునుండి యిక్కడకు వచ్చియుండెను. చెలికాఁడు కొండయ్యశాస్త్రికూడ నిచట నుండెను. ఆతఁ డీమాఱు సంఘసంస్కరణమునెడల సానుభూతి గనపఱుచునట్లు తోఁచెను. వేంకటరావును గుఱించి మాటాడుకొంటిమి. ఆతనికి నియమానుసరణమునకంటె సమయానుకూలవర్తనమే ప్రియతర మైన దని సిద్ధాంతపఱుచుకొంటిమి. ఆదినములలో వీరేశలింగముగారు కట్టించు చుండెడి పురమందిరము వీక్షింపఁబోయితిమి. ఆ సంస్కర్తనుగుఱించి యచటివా రెవరో పరిహాసముగఁ బలుకఁగా నేను జిన్నపోయితిని. సమాజమిత్రుఁడు, సచ్ఛీలుఁడునగు పాపయ్యగారు, "క్రైస్తవ మతబోధకులవలె శాంతమతితో మనము కష్టములకుఁ గటువుపదములకు నోర్చుకొనుచు, పట్టుదలతోఁ బనులు చేసినచో, మనకు విజయము చేకూరును" అని పలికి నన్నోదార్చెను.

జూలై 1 వ తేదీన మా యనుంగుమిత్రుఁడు లక్ష్మీనారాయణగారు రాజమంద్రి వచ్చి, సంఘసంస్కరణవిషయమున నా కృషిని గూర్చి తాను మిత్రులవలన వింటి నని చెప్పి, నన్నభినందించెను