పుట:2015.373190.Athma-Charitramu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోటులకు వెఱచునా? తన జీవితకథను ధారాళముగ వినిపింపసాహసించిన కథకునికి, చిన్నకల్లలచేఁ దన నెరసులు కప్పి పుచ్చనెంచుట సిగ్గులచేటుగదా !

"సత్యప్రకటనమె ముఖ్యావధిగఁ జేకొనిననేను, కీర్తిధనాదుల మీఁదఁ గన్నువేసి, యీ పుస్తకరచనమునకుఁ బూనుకొనలేదు. ఇదివఱలో నాత్మచరిత్రము నాంధ్రమునఁ బ్రచురించిన మద్గురు వర్యులగు కీ. శే. కందుకూరి వీరేశలింగముపంతులుగారి "స్వీయచరిత్రము"ను, గాంధీమహాత్ముని "ఆత్మకథ"ను మించనెంచి నే నీ పుస్తకమును వ్రాయలేదు. ఆ గ్రంథకర్తలు మహామహులు నాదర్శపురుషులును. ఒక్కొకప్పుడు నాబోటి సర్వసామాన్యుని చరిత్రముకూడ సంసారయాత్ర గడపుటయందు కొందఱికి సహాయకారి కావచ్చుననియె నాయాశయము."

"ఇవ్విధమున నా జీవితముగడచిపోయెను. నాకన్నులకె మిగుల లోపభూయిష్ఠముగ నున్న యీ జీవితము, స్వచ్ఛమును నాదర్శప్రాయము నని నే నెట్లు మురియఁగలను? ఐన నీకథ యెవరి కేమాత్రముగ నుపకరించినను, నేను ధన్యుఁడను. ముందును దయామయుఁడగు పరాత్పరుని ప్రాఁపె జీవితయాత్రయందు నాకుఁ జేయూఁత యగుఁగాత!"

పూర్వోదాహృతము లైన భావములు వేంకటశివుడుగారి సౌజన్యమునకును, వినయవివేకములకును నిదర్శనములైనను, గుణావగుణములనిర్ణయమునకు ప్రమాణములు కావని ఆత్మచరిత్రము విశదముచేయుచున్నది.