పుట:2015.373190.Athma-Charitramu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25. ఏకాంతజీవితము 99

అనగత్యముగను, అకస్మాత్తుగను నేను కొన్ని యుదంతముల నందుఁ జొప్పించితి ననియు, ప్రేమాకుసుమమును పొంకముగఁ జిత్రింపలే దనియును, అతఁడు చిఱాకుపడెను. నా కథయందు వర్ణనములకుఁ దావు లేదనియు, ముందు రచించెడి కథాసంగ్రహమే నే నిందు సూచించితిననియు, నా సమాధానము. అచటనచట సొంపులు లేక పోలేదని యతఁడు పలికెను.

మరల రాజమంద్రి చేరినపిమ్మట మే మిరువురమును విచిత్ర లేఖలు కొన్ని వ్రాసి, ఒకస్త్రీ వ్రాయునట్టుగా వానిని "వివేకవర్థని"లోఁ బ్రచురింప నుద్యమించితిమి. 13 వ జూన్ తేదీని వెంకటరావు నేనును, "వీరేశలింగముపంతులు నిజమైన సంస్కర్తయేనా?" యను విషయమునుగుఱించి చర్చించుకొంటిమి. మతసాంఘికవిషయములందు సంస్కర్తకర్తవ్య మేమి ? లోకముదెస నాతనివర్తన వ్యవహారములు నిష్కళంకములుగ నుండవలయును. అతనికి శత్రువులు, ముఖ్యముగ వ్యక్తిసంబంధమగు శత్రువులు, నుండరాదు. వీరేశలింగము పంతులు కోపస్వభావులై, కక్షలకుఁ గడంగి రని మే మనుకొంటిమి. ఏకైకస్నేహితుఁడగు గవరరాజుగారు అకాలమరణము నొందుటచేత, కలసి పని చేయుట కెవరును తోడు లేక, ఏకాకియై పంతు లిపుడు దినములు గడుపుచున్నాఁడు వితంతూద్వాహపక్షమువారు, వీరేశలింగముగారిని విడిచి, ఆయనపలుకులకు క్రియలకు వికటవ్యాఖ్యలు సలుపుచుండు నొక ప్రబుద్ధుని యండఁజేరి రని మేము చెప్పి పంతులను వారింప నుద్యమించితిమి.

12 వ తేదీని నేను వెంకటరావును గలసికొంటిని. అతఁడు స్త్రీలోలత్వమునుగుఱించి ప్రసంగింపఁబూనఁగ, అది గర్హ్య మని నేను బలికితిని. తుంటరులనుగుఱించి యతఁ డంత ప్రస్తావించెను.