పుట:2015.373190.Athma-Charitramu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24. కమలా మనోహరులు 97

మెంచుచున్నను, చిన్ననాఁటనుండియు నామనస్సు మనోహరము మీఁదనే యున్నది. అతఁడె నా హృదయాధి నాధుఁడు. భూలోక కిల్బిషము లెవ్వియు సోఁకకుండ దైవము మా ప్రేమలత నిన్నాళ్లును బ్రోచుచుండెను. అట్టి పవిత్రప్రేమ కాధారమగు ప్రియుని వదలి పరపురుషుని జేపట్ట నొల్ల కున్నను, ఇంతవఱకు నా నిజాభిప్రాయము వెల్లడింపమికి ప్రాణత్యాగమే ప్రాయశ్చిత్తముగఁ జేకొనుచున్నాను ! నా తుదితలంపులు దెలుపు లేఖను మనోహరమున కందఁజేయ మిమ్ము వేడుచున్నాను !' అని యాయువతి, కలము కాకితమును గైకొని యీ రెండు కమ్మలును వ్రాసెను. ఇవి లిఖించినపు డా తరుణి ముఖబింబమున తాండవించిన తేజోవిశేష మేమని వర్ణింతును ? ఆ సుందరవదనమున ప్రస్ఫుటమైన యాత్మవికాసము భూలోక సంబంధమైనది గాక, ఏ దివ్యలోకమునుండియో దిగి మరల నా భవ్యలోకమును వేవేగమె పొంద కాంక్షించునట్టిదిగఁ దోఁచెను! రెండవలేఖ పూర్తి కాకమునుపె, ఆ చెలువ చిన్ని వేళ్లనుండి కలము పట్టుతప్పెను ! ప్రచండవాయుచలనమున నేలపాలగు చూతలవలె నాలతాంగి పుడమి మీఁద కోరగిల్లి పడిపోయెను !

"ఆ సుందరి వ్రాసియుంచిన కమ్మలివె!" అని యా పెండ్లి కుమారుఁడు జేబునుండి యవి తీసియిచ్చెను. అందొకటి తలిదండ్రులకును రెండవది మనోహరమునకును కమల వ్రాసెను.

మనోహరుని కమ్మలో నిటులుండెను : - "ప్రియసఖా! ఇది నా తుది యుత్తరము. ప్రేమబంధమున మన జీవితము లొక్కటియగు నని నేను మొదటినుండియు నువ్విళ్లుగొనుచుండుధానను. కాని, నే నిష్టపడకున్నను, తలిదండ్రులు చిన్న నాఁడె నాకుఁ బరిణయము చేసిరి.