పుట:2015.373190.Athma-Charitramu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24. కమలామనోహరులు 93

మేర్పఱిచిరి. కమలపెండ్లి మిత్రు లందఱికివలెనే మనోహరమునకు నానందదాయక మయ్యెను. ఏకారణముననో కాని, పెండ్లికూఁతునకే సంతోషావహముగ లేదు. పురుషునికంటె స్త్రీకి, భవిష్యద్దాంపత్య జీవితరహస్యము, అతివేగముగను, స్ఫుటముగను బొడకట్టుచుండును. తన కీపెండ్లి యక్కఱలేదను కమల పలుకులు, అబద్ధమని నిరసించుటకుఁగాని, నిజమని నమ్ముటకుఁగాని తలిదండ్రులకుఁ దోఁపకుండెను. పసిరిక మొగ్గవంటి బాలికమాటలు చెవియొగ్గి వినుటయె వెఱ్ఱియని తుదకు తలిదండ్రులు తలపోసి, కమలను తమబంధువులలో నొకని కిచ్చి పరిణయము గావించిరి.

పూర్వదిశాంగనాముఖము, ప్రాతస్సమయమున నొక్కొక్క పరి పలువన్నెల మబ్బులచే మాటుపడియు, భానూదయకాంతుల ప్రథమస్పర్శముననె వికాసముఁ జెందుచుండును. పెండ్లిపీటలమీఁద నుండునపుడు, కమల వదనబింబ మొకించుక విచారమేఘావృత మయ్యును, తలంబ్రాల సమయమునకు కళంకరహిత మయ్యెను. బాల్యదశయందు సుఖదు:ఖములు స్వల్పనిమిత్తములకు వశవర్తు లగు చుండును. కాని, బాల్యకాలపు టూహలు నుద్దేశములు నొక్కొక్కప్పుడు, జీవితభూమిని వేళ్లువాఱి, ఆమరణమును పెకలింప నసాధ్య మగుచుండును !

(2)

అది ప్రాత:కాలము. వసంతభానుఁ డింక నుదయాద్రి నధిష్ఠింపలేదు. గృహారామమున చూత నారికేళాదివృక్షములు, పూవులమొలకలును, గుబురుగఁ బెరుఁగుచున్నవి. విరుల నెత్తావులు గాలి యంతటను ప్రసరించియున్నవి. లేఁజివురులు మెసవుచు కోకిల