పుట:2015.373190.Athma-Charitramu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 92

బిందువులు కనులనుండి జలజల రాలెను. నా మనస్తాపము భావోద్రేకముగఁ బరిణమిల్లెను. అంత నేను సంస్కరణవిషయిక మగు కథ నొకటి కల్పించుకొని వినోదించితిని. రాత్రి యంతయు కథావిమర్శనమునఁ గడపుటచేత కంటికిఁ గూర్కు రాలేదు. మఱునాఁటి దినచర్యపత్రములం దాకథ నింగ్లీషున లిఖించి, భావికాలమున దానిని తెలుఁగున పద్యరూపమునఁ గూర్ప నాశించితిని. ఈజన్మమున నా కిఁక కవిత్వభాగ్య మబ్బుట కవకాశము లేమింజేసి, దాని నాంధ్రమున ననువదించి, "కమలామనోహరులు" అను శీర్షికతో "ఆంధ్రపత్రిక" లో 18 - 1 - 1930 తేదీని ఇట్లు ప్రచురించితిని : -

(1)

నలువది సంవత్సరముల క్రిందట వసంతపురమున నొకబాలుఁడు నొకబాలయుఁ గలరు. సమానప్రాయముగల వా రిరువురును, గ్రామమున నొకశ్రేణినె కాపురమున్న భిన్న శాఖలకుఁ జెందిన సాధు విప్ర కుటుంబములలో జన్మించిరి. కమలామనోహరు లాజన్మమిత్రులు. వీరి స్నేహ సౌహార్దములు పూర్వజన్మఁపునాఁటివే యని లోకు లనుకొను చుందురు ! ఆట పాట లందును, విద్యాలయమునను వా రొకరి నొకరు విడిచియుండువారు కారు. దేహములు వేరైనను, ప్రాణములు వారి కొకటియె ! ఒక్కొకతఱి వారు అనతిదూరమందలి సెలయేటి యొడ్డున కేగి, పెద్దరాతిపలకమీఁదఁ గూర్చుండి, భూమ్యాకాశములు తిలకించి, సుఖసంభాషణములు జరుపుచుందురు.

లోకమున సౌఖ్యకాల మెంత త్వరితగతి నంతరించుచున్నది ! బాల్యవివాహాచారబద్ధు లగు జననీజనకులు, కమలకు పండ్రెండు వత్సరములకె పాతికయేండ్లు నిండునట్లు భావించి, కొమార్తె వివాహ