పుట:2015.373190.Athma-Charitramu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17. సోదరీనిర్యాణము 63

కాని, నేను శాంతము వహింపవలె ననియు, పూర్వాచారపరాయణులగు తలిదండ్రులపోషణమున నుండెడి యీ విద్యాభ్యాసకాలమున, బొట్టు జుట్టు మొదలగు బాహ్యవిషయములను గుఱించి యనగత్యముగ నేటి కెదురీదవల దనియు, సంస్కారప్రియులగు స్నేహితులు నాకు హితోపదేశము చేసిరి. అంతటినుండి యీవిషయములందు నే నెంతో జాగ్రతతో మెలంగితిని. కాని, నాకుఁ బ్రియతరములగు మతవిషయిక గ్రంథములు మనసార పఠించి, నాయభిప్రాయముల నితరులకు బాహాటముగఁ దెలుపుటకు పరిపూర్ణావకాశ ముండుటవలన, నేను వెనుకటికంటె నధికోత్సాహమున బ్రాహ్మమతగ్రంథములు చదివితిని. ఇంతియ కాదు. మిత్రులు కనకరాజు జగన్నాధరావు నేనును బ్రాహ్మ సమాజ ముఖ్యసూత్రములు విశ్వసించితి మని ప్రతిజ్ఞ చేసికొంటిమి. మావలెనే యింకఁ గొందఱు మిత్రులును మమ్ముఁ జేరినచో, మేము రాజమంద్రిలో బ్రాహ్మసమాజము నెలకొలుప నుద్యమించితిమి !

17. సోదరీనిర్యాణము

చిన్నితమ్ములను చెల్లెండ్రను ఎత్తికొని యాడించుట చిన్ననాఁటనుండియు నా కెంతో ముచ్చట. ఏడ్చుచుండెడి నెలగ్రుడ్డులను సైతము శమింపఁజేయురహస్యము బాల్యముననే నాకుఁ బట్టువడినటు లుండెను. శిశువులను శాంతింపఁజేయ నేను బడెడి శ్రమను జూచి, మాపెద్దపెదతల్లి నన్ను "పెంపుడుతల్లీ !"యని నవ్వుల కనుచుండెడిది. పాలు ద్రావునపుడును భుజించునపుడును దక్క మిగతకాలము, చిన్ని తమ్ములు చెల్లెండ్రును సామాన్యముగ నాచెంతనే గడపెడివారు. వారి నెటుల లాలింపవలయునో బుజ్జగింపవలయునో, మాయమ్మకు వలెనే నాకును దెలిసియుండెను. బాల్యమందు వారలకు నే నిడిన