పుట:2015.373190.Athma-Charitramu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 62

ఆ దినములలో నేను క్రైస్తవమత ప్రచారసంఘమువారి ప్రచురణమగు "మతసంస్కరణము"నుగూర్చిన పుస్తకములు అత్యంతతమకమునఁ జదివితిని. క్రైస్తవుఁ డగుగ్రంథకర్త పక్షపాతబుద్ధి పుస్తకములలోని పత్రపత్రమునను నుబుకుచున్నను, హిందూమతమును గూర్చియు, సంస్కరణసంస్థలగు నార్యబ్రాహ్మమతములను గుఱించియు నా కిపుడు కొన్నియమూల్యాంశములు బోధపడినవి. అన్నిటికంటెను బ్రాహ్మమతధర్మమువలె నాకు యోగ్యములుఁగ గానఁబడినవి. నవంబరు 29 వ తేదీని నేను కళాశాలలో వీరేశలింగముగారితో బ్రాహ్మసమాజమునుగూర్చి ప్రసంగించితిని. ఆయన నాయభిప్రాయములను దృఢపఱిచెను. కావున నే నిపుడు పరిశుద్ధాస్తికమత మవలంబనీయ మని విశ్వసించి, స్నేహితుల కది ప్రబోధింప మొదలిడితిని. కనకరాజు, జగన్నాధరావుల కిది ప్రీతికరమె గాని, కొండయ్యశాస్త్రి మున్నగు వారలకుఁ గంటకసదృశముగ నుండెను. !

కొంతకాలమునుండి రేలంగిలో శరీరస్వాస్థ్యము తప్పియుండి యిపుడు నెమ్మదిపడిన మాతండ్రిని, డిశెంబరు రెండవవారమున మా తల్లియు తమ్ములును రాజమంద్రి తీసికొనివచ్చిరి. నాప్రకృతవిపరీత చర్యలు కనిపెట్టి యాయన యుగ్రుఁ డయ్యెను. ఇటీవల నే నవలంబించిన సంస్కరణపద్ధతులకథన మాయన కపుడు వినవచ్చెను. రాజమంద్రిలో సకుటుంబముగ నివసించుచుండెడి నా మామగారు మఱి కొందఱును నా వికారపుచేష్టలను మాజనకుని కెఱిఁగించిరి. నేను క్రైస్తవునివలె జుట్టు పెంచితి ననియు, బొట్టు పెట్టక, మడి గట్టక, భుజించుచుంటి ననియు, జందెము తీసివైచి నాస్తికుల సావాసము చేయుచుంటి ననియు, నామీఁద నేరారోపణములు చేయఁబడెను !