పుట:2015.372412.Taataa-Charitramu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లన్నిటికిని తీసిపోకయుండెను. భారతదేశమున ఈపరిశ్రమ కిప్పు డవకాశములేదని లోగడ నొకయపోహ కల్గియుండెను. ఆయపోహయిందుచే తొలగెను. తాతాకిందుగల్గిన విజయముచూచి, భారతప్రభుత్వము మైసూరు ప్రభుత్వముకూడ స్వయముగ పట్టుతోటల బెంచి, పట్టుపరిశ్రమకు ప్రోత్సాహ మొసగిరి.

లాభముకొరకు కాక, ఇతరుల కాదర్శముగ నుండుటకే, తాతా ఈపరిశ్రమకై రు 50,000 ఖర్చుచేసి, చాల ప్రయాసతో నీపరిశ్రమకు పునరుద్ధరణ గావించెను. ఆతోటలోని పట్టు భారతదేశమంతటను ప్రసిద్ధిజెందినది. తాము తరువాత స్థాపించిన పట్టుతోటలందు చిక్కుకలిగినప్పుడెల్ల, భారతప్రభుత్వమువారు జంషెడ్జి తాతాకు వ్రాసి, ఆయనసలహా పొందుచువచ్చిరి.

జంషెడ్జి యనంతర మాయనకొమా ళ్ళితరోద్యమము లందు నిమగ్నులై, తీరిక లేక, ఈపట్టుతోట నమ్మజూపిరి. మన దేశమున నిమ్నజాతి వృద్ధికై పాటుపడు క్రైస్తవసంస్థయగు 'సాల్వేషన్ ఆర్మీ'కి నాయకుడగు 'బూత్ టక్కర్‌' గా రీతోటనంతట కొనిరి. ఆయన జంషెడ్జికి ముఖ్యస్నేహితుడై, ఆయన యుద్యమములందు సానుభూతి కల్గియుండెను. అందుచే తాతాపేరనే పిల్చుచు, టక్కరుగారా తోటను వృద్ధిజేసెను.

'తాతా తోట' పద్ధతినే, ఇప్పుడు అలీఘరు మోరదాబాదు, సింహళము, మున్నగుచోట్ల పట్టుతోటలు పెంచబడి, వృద్ధిలోనున్నవి. మున్ముందు పట్టుపరిశ్రమ మనదేశమున నింకను వృద్ధిగాంచి, ముఖ్యగృహపరిశ్రమలలో నొకటి కావచ్చును.


__________