పుట:2015.372412.Taataa-Charitramu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిగిలినది భాగస్థులకు పంచియీయబడెను. ఆ మిల్లుకుకొత్త యంత్రము లేర్పడి, వ్యాపారమువృద్ధియై, తుదకది 5 పెద్దమిల్లుల సమూహముగా నేర్పడినది; వానికితోడు, అద్దకపుపనులు మున్నగు అనుబంధ పరిశ్రమలకును విశాలభవనములు, వసతిగృహములు, వ్యాయామస్థానములు మున్నగునవి చేర్చి కట్టబడినవి. ఆ మిల్లుల నిర్వాహకులగు తాతాకంపెనీవారు తరువాత నాగపురమం దున్నతవిద్యాభివృద్ధికి చాలసహాయముచేసిరి. 1921 లో తాతాపేర స్త్రీలకు హైస్కూలు స్థాపితమై, దానికి తాతాకంపెనీ వారు లక్షరూపాయలనిచ్చిరి. 1925 లో నాగపుర విశ్వవిద్యాలయ మేర్పడెను; అప్పుడు జంషెడ్జి తాతాకు స్మారకముగ 'యూనివర్సిటీ' భవనము నిర్మించుటకు తాతాసన్సు వారింకొక లక్షరూపాయలనిచ్చిరి. ఇట్లు తాతాకుటుంబమువలన, ఎంప్రెసుమిల్లుద్వారా నాగపురప్రాంతమున వేలకొలదిజనులకు జీవనోపాధి యేర్పడుటయే గాక, అనేక విద్యాసంస్థలకును చాల ప్రోత్సాహము కల్గెను.


__________