పుట:2015.372412.Taataa-Charitramu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. వ్యాపారారంభము.

ఆకాలమున మనదేశమున ప్రభుత్వమువారి ప్రోత్సాహముతో చాలనల్లమందుజేసి, చీనా కంపి, వర్తకులు అందు హెచ్చుధర కమ్ముచుండిరి. ఈలాభకర వ్యాపారమును కొందరు సాహసులగు పార్సీలు, చీనాసమీపపు 'హాంకాంగు' ద్వీపముద్వారా, జరుపుచుండిరి. 'హాంకాంగు' ఆంగ్లేయుల వశమగుటకు పూర్వమే, మనసూరతు ప్రాంతమునుండి పోయి కొందరు పార్సీ లందు వసించుచు, వర్తకమును జరుపుచుండిరి. అప్పటికి మహానౌకలు, తంతిసౌకర్యము, లేవు. ఇటనుండి చీనా చేరుట కారు నెలలు పట్టుచుండెను; అపాయము లధికము. అందుచే, చీనా వ్యాపారమున పార్సీలకు పోటీ లేకుండెను. అప్పటి చీనులు నల్లమందు భాయీలగుటచే, ఆపార్సీల కీవర్తకమున చాలలాభము కల్గెను. తండ్రితరపున జంషెడ్జియు హాంకాంగుచేరి, చీనాతో నాలుగేండ్లా వ్యాపారము జేసి, ధనము అనుభవము సంపాదించి, అ వ్యాపారముపై విరక్తిగల్గి, 1863 లో మరల బొంబాయి చేరెను. వెంటనే జంషెడ్జి కాంగ్లదేశ ప్రయాణము తగిలెను.

మిల్లుయంత్రములందు సన్నబట్టల వడికినేయుటలో గత శతాబ్దిని బ్రిటిషువా రగ్రేసరులైరి. కాని వారిదేశము శీతలము; భూమి చాలవరకు కొండనేల; అందు ప్రత్తిపండదు; అందుచే నాంగ్లేయులు తమ మిల్లులకు దూది నిప్పటికిని విదేశములనుండి తెచ్చుకొనుచున్నారు.