పుట:2015.372412.Taataa-Charitramu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పటి పారసీకసేనాని యగు 'రుస్తుం' గొప్పశూరుడే. కాని మూడురోజులు సంకులయుద్ధము జరిగి, తుదకు పారసీకు లోడిరి. అరబుతరంగ మా దేశమంతటను వ్యాపించెను. పారసీకులందరకు 'కురాను' ఖడ్గము నెదురయ్యెను;†[1] ఆజను లిస్లాము నంగీకరింపనిచో, ఖడ్గమున కెరయగుచుండిరి. దాదాపు పారసీకు లందరును త్వరలోనే ముసల్మానులైరి; కొంద రు ధీరులుమాత్రము తమ కానువంశికమగు 'జొరాస్టరు' మతము విడనాడరైరి. వా రారబులప్రచండధాటి కోర్వలేక, జన్మభూమిని సర్వస్వమునుగూడ వదలి, దేవునిపై భారమువైచి, ఆకాలపు చిన్న యోడలలో మహాసముద్రముపై బయలుదేరిరి. అనేకకల్లోలములను ప్రమాదములను దాటి, ఆయోడ లెట్లో క్రీ. త. 720 ప్రాంతమున మనదేశపు పశ్చిమతీరమును జేరెను. ఆయోడలలో వచ్చిన యా పారసీకు లీదేశమందే యుండిపోయిరి; వారివంశీయులే నేటికిని 'పార్సీ' లనబడుచున్నారు. వారు వసించినప్రాంత మగు మన ఘూర్జరదేశ మప్పుడు చాళుక్యరాజుల పాలనలో నుండి సర్వసంపత్సమృద్ధ మైయుండెను. (దీని యుత్తరప్రాంత

  1. † 'కురాను' మహమ్మదు బోధనలదెల్పు, ఆమతపు మూలగ్రంథము. ఆమతమును 'ఇస్లాం' అనియు నందురు. ఆమతస్థులను ముస్లిములు, ముసల్మానులు, అనియు చెప్పుదురు. ఇది ఏళేశ్వరమతము; ఇందు అవతారములకు, విగ్రహారాధనలకు, జాతికులభేదములకు, తావులేదు. మహమ్మదును ప్రవక్తయే గాని దేవుని అవతారము కాదని, ఇట్లే ఏసుక్రీస్తు, బుద్ధుడు, మున్నగు పూర్వపు మతకర్తలును ప్రవక్తలేయనియు ఆమతసిద్ధాంతము.