పుట:2015.372412.Taataa-Charitramu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాతా చరిత్రము

1. పార్సీలు.

మనభారతదేశమున జాతులు, మతములు, చాలగలవు. అందు హిందువులు సుమారు 24 కోట్లు, ముసల్మానులు రమారమి 9 కోట్లు, ఉందురు; క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులుగూడ కొలదిగ నున్నారు. పార్సీలసంఖ్య వీరందరి కన్ననుతక్కువ. వీరు సుమా రొకలక్షమాత్ర మెయున్నను, చాలప్రముఖులుగ నున్నారు. వీరి పూర్వచరిత్ర, ఆచారములు, విచిత్రములు.

పార్సీ లార్యజాతీయులు. ఆర్యులమహాజాతి చరిత్రకాలముకు చాలపూర్వమే రెండుగా చీలెను. అం దొకశాఖవారు యూరపులోని గ్రీసు, ఇటలీ, జర్మనీ, ఇంగ్లండు, ఫ్రాన్సు మున్నగుదేశములంజేరిరి; రెండవశాఖవారు ఆసియాలో పారసీక హిందూస్థానాదులందు స్థిరవాసులైరి. ఈప్రాచ్యులు పూర్వము కొంతకాలము మనదేశముకు పారసీకముకు మధ్యప్రాంతమున వసించుచుండ, కాలక్రమమున వారిలో రెండుశాఖ లేర్పడి, ఈయుభయులమధ్యను కలహము గల్గెనని, అం దసురశాఖీయులు పారసీకమున వ్యాపించిరని, దేవశాఖీయులు సింధునది దాటి మనదేశపు ఆర్యావర్తవాసులైరని, కొందరు చారిత్రకులందురు.†[1]

  1. † ఈయైతిహ్యముప్రకార మాయుద్ధమే 'దేవాసురయుద్ధ' మనబడెను; ఇట్లు దేవాసురులందరు అసలు ఏకజాతీయులై యుందురు. అసురులకు 'పూర్వదేవు' లనియు పేరుగలదు.