పుట:2015.372412.Taataa-Charitramu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇచటి జనులకు నేర్పెను. చాలసొమ్ము ఖర్చుపరచి, ప్రశస్తమగు ప్రత్తిని సాగుచేయువిధమును ఈజిప్టులో స్వయముగా నేర్చుకొని, ఆప్రత్తిని మనదేశమున పండించెను. నల్లమందు ఆబ్కారి మున్నగువాని వ్యాపారమువలన పూర్వమునుండి తోటిపార్సీమిత్రులు చాలలాభ మొందుచుండిరి. తనతండ్రియు తనను చీనాతో నల్లమందువ్యాపారమున దింపెను. కాని లాభకారియైనను, అవి ప్రజాహానికరములను భావమున, ఆవ్యాపారములను జంషెడ్జి త్వరలో వదలిపెట్టెను. మనదేశమున కుపయోగించు క్రొత్తపరిశ్రమలస్థాపించుటే, ఆయనముఖ్యోద్దేశము. ఆయనకట్టించిన భవనములలోను అనుకరణీయమగు క్రొత్తపద్ధతులుండెను. ఆయాదర్శ పద్ధతులు క్రమముగా దేశమున నితరులకు మార్గదర్శకము లయ్యెను. ఆయన 'తాజ్ మహల్ హోటలు' విదేశీయుల సంస్థల కన్నను మిన్నయై, భారతీయుల గౌరవమును వృద్ధిజేసినది. ఆహోటలులో నాయన చక్కనియుచితగ్రంథాలయాదుల నేర్పర్చెను.

పెద్దపరిశ్రమలకు, ఇంజనులు పనిముట్లు వస్తువులు ఏర్పడుటకు, మంచియినుము ఉక్కు అవసరములు. తక్కినవానికి కీలకమగు లోహపరిశ్రమస్థాపనవలననే అన్ని దేశములందు నితర పరిశ్రమలేర్పడి, వానిసంపద హెచ్చినది. మనదేశమున పెద్దపరిశ్రమలస్థాపనకు, (ముఖ్యముగ చోదకశక్తికి లోహపరిశ్రమకు) అవకాశము లేదని, అందుచే నెల్లకాలమును భారతదేశము వ్యవసాయదేశముగనే యుండుచు, విదేశములకు ముడివస్తువులనే