పుట:2015.372412.Taataa-Charitramu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయనగుణములలో రెండవది సౌజన్యము. బంధు మిత్రాదు లందరియందును ఆయనకు ప్రేమయుండెను; ఎన్నడును, ఎవరియందును, తాతాకు అసూయ, మాత్సర్యము, లేవు. అందరితోను సహృదయుడై, ఆయన యెల్లప్పుడును న్యాయబుద్ధితోనే యుండెను. ఆయనతో వ్యవహరించువా రందరును గాఢమిత్రులై, విశ్వాసముగల్గి, తామును విశ్వాసపాత్రులై, ఆయన కన్నివిధములను తోడ్పడుచుండిరి. ఇతరులయందు మనము విశ్వాసముతో వర్తించినచో, వారును మనయందు విశ్వాసముగల్గియే యుందురు. మోసము, పేరాస తాత్కాలికముగ లాభకరమైనట్లు కనబడినను, వ్యాపారమునగూడ నీతి న్యాయశీలతయునే తుదకు స్థిరలాభ మొసగుననుటకు తాతాజీవితమే నిదర్శనము.

ఆయన నిగర్వి, వినమ్రుడుగా నుండెను; జనులనుండి గాని, ప్రభుత్వమునుండి గాని పేరుపొంద యత్నింపలేదు. విజ్ఞానాలయముకు తన పేరుపెట్టవలదని నిషేధించెను, గౌరవ పదవులకు బిరుదములకు ఎన్నడు నపేక్షింపలేదు; బొంబాయిలో గౌరవ న్యాయాధికారిగను, తరువాత విశ్వవిద్యాలయ సభ్యుడుగను, మాత్రముండెను.

ఐనను, స్వజాతిగౌరవముకు భంగము కలుగునని తోచినప్పుడుమాత్ర మాయన పట్టుదలతో నాత్మగౌరవమును కాపాడుకొనుచుండెను. ఒకసారి 1863 లో నొకయుత్సవము జూ