పుట:2015.372412.Taataa-Charitramu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గృహము జేరి, చక్కగ భుజించును. (ఆయన కొంచెము భోజనప్రియుడు.) మద్యపాన మెన్నడును చేయుట లేదు; రాత్రి చాలసేపు గ్రంథముల జదువుచుండును. ఆయనకు మంచి పుస్స్తకముల జదువుటయన్న చాలప్రీతి. ఆటలాడుట కాయనకు తీరిక, అభిలాషయుకూడ, లేకుండెను. కాని ఆయన మంచి వ్యాయామ గ్రంథములగూడ దెప్పించి, తనక్లబ్బుల కిచ్చుచు; తానును చదువును. ఆయన గుజరాతీ హిందూస్థానీలలోనే గాక, ఇంగ్లీషులోను మంచి విద్వాంసుడయ్యెను. ఆయన రచనశైలి శబ్దాడంబరములేక, సులభమై, ఓజోవంతమై యుండెను.

ఆయన వ్యక్తిజీవనము పరిశుద్ధమైనది. ధనికుడైనను, ఆయన యెన్నడును వ్యసనములకై ద్రవ్యమును దుర్వినియోగము చేయుటలేదు; తనయింటిపిల్లలకు దురభ్యాసములు కలుగకుండునట్లు జాగ్రత్తతో నుండుచు, వారికి మితవ్యయమును స్వతంత్రముగ వ్యవహరించుశక్తిని, నేర్పుచుండెను. మద్యపానము, స్త్రీలోలత, జూదము, పందెములు, ఆటపాటలు, ఆడంబర వేషములు, ఆయన కెన్నడును లేవు. విదేశసంచారములందు గూడ దుస్సాంగత్యమున తన సంప్రదాయముకు భిన్నమగు పాశ్చాత్యుల కేళీవిలాసములందును బడకుండ, అప్రమత్తుడై యుండెను. (రుచికరమగు భోజ్యవస్తువుల జూచినప్పుడు మాత్ర మాయనకు కొంచెము జిహ్వాచాపల్య ముండెనట). తాతా నిరాడంబరుడై, తెల్లని సాదాదుస్తులను పార్సీల సాంప్రదాయకమగు పాగానో టోపీనో ధరించెను.