పుట:2015.372412.Taataa-Charitramu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదుస్థితిలో, వెంటనే దొరాబ్జి యామృతదేహమును తైలసిక్తముజేసి, నౌహీమునుండి లండనునగరముకు జేర్చెను. అచట యూరపునందుండిన పార్సీలందరును, చాలమంది భారతీయ మిత్రులును, జంషెడ్జియొక్క పాశ్చాత్యమిత్రులును సమావిష్టులైరి; అంతట, అచటి పార్సీదేవాలయమున పార్సీమతవిధుల ప్రకారము సంస్కారము చేయబడెను. (పార్సీలమృతదేహముకు ఖననము దహనము గూడ జరిగింపరు. పార్సీదేవాలయముల పైభాగమున మృతసంస్కారమునకై ప్రత్యేకస్థానమేర్పడి యుండును; అందు కళేబరము మంత్రయుతముగ, డేగలుమున్నగు జంతువులకు బలిగ వదలివేయబడును. నరునియాస్తియే గాక యాతని సర్వస్వమగు దేహమును జీవితకాలమందును అనంతరముకూడ, ఇతరజీవుల యుపయోగమునిమిత్తమే వినియోగము కావలెననియు, వ్యర్ధముగబోకూడదనియు, తెల్పు మహాసిద్ధాంతమిందిమిడి యున్నదని తోచును. పార్సీలలో చాలమంది మహాదాతలగుట కీసంస్కారసూత్రము కొంతవరకు తోడ్పడియుండవచ్చును.)

మరణించునప్పటికి జంషెడ్జి వయస్సు 65 సంవత్సరములు. భారతీయుల దామాషాఆయుర్దాయము చాలమంది విదేశీయుల దానికన్న మిక్కిలి తక్కువ. అందువలన జంషెడ్జిమృతి యకాలమరణమనుటకు వీలులేదు. భారతజాతీయపితామహుడుగ నుండిన దాదాభాయినౌరోజీ, పౌరపరిపాలన ధురంధరుడగు ఫిరోజిషా మెహతా, దిన్షా వాచా, మున్నగు కొలదిమంది జంషెడ్జి