పుట:2015.372412.Taataa-Charitramu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నతో నీజిప్టుకు వెళ్ళెను; అచ్చట నొకనెల యుండినమీదట, జ్యేష్ఠపుత్రుడును కోడలును 1904 ఫిబ్రవరిలో ఆయన నిటలీకి తీసికొనిపోయిరి.

అప్పుడు భారతదేశమున ఆయన భార్యయగు హీరాబాయి, చనిపోయెను; ఆవార్త తెలిసినమీదట జంషెడ్జి యారోగ్య మింకను క్షీణింపజొచ్చెను. దొరాబ్జితో వియన్నా నగరము పోయి, అందుండి జంషెడ్జి, వైద్యుల సలహాపైన, జర్మనీలోని ఆరోగ్యస్థానమగు 'నౌహీం' పురముకు చేరెను. ఆయన మనోబలముమాత్రము తుదవర కట్లే యుండెను. మరియు, ఆదుర్బలస్థితిలో గూడ, జంషెడ్జి మనదేశపు ఆర్థికాభివృద్ధినిగూర్చి యాలోచించుచునే యుండెను. యూరపులో క్రొత్తగా కనబడిన ఉపయోగకరమగు కొన్ని ఫలవృక్షములను పుష్పజాతులను మనదేశమున నెట్లు పెంచవచ్చునో, తనమిత్రులతో చాలసార్లు చర్చించుచుండెను. నీరసమును వ్యాధియు హెచ్చుచున్న కబురు తెలసి, దొరాబ్జి తనభార్యతో వియన్నానుండి నౌహీముకు వచ్చి, తండ్రిని కలుసుకొనెను. తాను తలపెట్టి యత్నించుచున్న మహోద్యమములను శ్రద్ధతో పూర్తిచేయుడని, స్వదేశపు పారిశ్రామికస్థితిని వృద్ధిచేయుడనియు, దొరాబ్జితోను మిత్రులతోను తన యంత్యాభిలాషమును తెల్పి, జంషెడ్జితాతా 19-5-1904 తేదీని కాలధర్మము నొందెను.