పుట:2015.372412.Taataa-Charitramu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్లేట్ కంపెనీ' యను మరియొక కంపెనీవారు ఇందు తగరపు డబ్బాలు ఇత్యాదుల జేయుదురు. 'ఎగ్రికల్చరల్ ఇంప్లెమెంట్స్ కంపెనీ'లో ఇనుపనాగళ్ళు మున్నగు వ్యవసాయ పరికరములు తయారగును. 'ఎన్‌ఫీల్డ్‌కేబిల్ కంపెనీ'లో విద్యుచ్ఛక్తి ప్రసారాదులను వలయు బలీయమగు లోహపు తీగలు చేయబడును. 'ఇండియన్ స్టీల్ వైర్ ప్రోడక్ట్స్‌' వారుక్కు తీగలతో వివిధ వస్తువుల జేయుదురు. 'ఎనామల్డ్ ఐరన్ వేర్ కంపెనీ' వారు ఎనామలు పూతతో రేకు పాత్రల జేయుదురు. ఇట్లు మనకు తరుచు అవసరమగు చాల వస్తువులను ఇదివరలోవలె విదేశముల నుండియే తెప్పించుకొననక్కరలేకుండ, ఇచటనే తయారు చేయబడుచున్నవి. తాతాలోహ యంత్రశాలలో ఇనుము ఉక్కు సులభముగ దొరికి, శిల్పులు సిద్ధముగ యంత్రముల పనినేర్చియుండుట చేతను, సమృద్ధియగు విద్యుచ్ఛక్తి నేలబొగ్గు మున్నగు సౌకర్యములుండుట చేతను, అట్టి అనుబంధ పరిశ్రమలు గూడ ఇచ్చట నేర్పడి, గిట్టుబాటుగ పాశ్చాత్యపు సరుకులతో పోటీకినిలుచుట సాధ్యమైనది.



__________