పుట:2015.372412.Taataa-Charitramu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉక్కును పనిముట్లను తయారుచేయవలెనని, జంషెడ్జి నిశ్చయించెను. అట్లు పెద్దయెత్తున చేసిననే, అవి ప్రశస్తములై, చౌకగ గిట్టుబాటగును. ఇందుకు నేలబొగ్గు, ఇనుము, సున్నము, ఈమూడింటి గనులు సమీపముగనుండి జలవసతిగూడ గల ప్రదేశమవసరము. ఈవస్తువులు బలువువి. ఆగనులు పరస్పరము దూరమందుండిన లాభములేదు. మరియు అవి సమృద్ధిగ లేకున్న పెద్ద యెత్తున చౌక యగునట్లు తయారుచేయ వీలుండదు.

ఈదేశమున నట్టి సన్ని వేశ సౌకర్యములుగల గనులులేవని, అందువలన పెద్దఅయ:పరిశ్రమ సాధ్యముకాదని, మనదేశపు ప్రభుత్వోద్యోగులు భూతత్వజ్ఞులుగూడ తలచుచుండిరి. కాని తాతా అట్లెంచలేదు. ఈదేశమందు తయారైన పూర్వపు లోహవస్తువు లుండుట బట్టియే, అట్టిసౌకర్యములు మన దేశమందుండి తీరునని, సరిగ వెదకినచో అట్టిగనులు దొరకుననియు, ఆయనకు దృఢవిశ్వాసముండెను. ఇందునుగూర్చి ప్రచురితమగు గ్రంథములన్నిటిని, కరపత్రములనుగూడ, ఆయన యెప్పటి కప్పుడు, తెప్పించి జాగ్రత్తతో పరిశీలించుచుండెను.

మనదేశపు మధ్యరాష్ట్రమున చందాజిల్లాలో లోహగనులు కలవు. వానినిగూర్చి 'వాన్ స్వార్‌' అను జర్మను వైజ్ఞానికుడు వ్రాసిన వ్యాసమును మనప్రభుత్వమువారు 1882 లో ప్రచురించిరి. అప్పుడు జంషెడ్జి మధ్యరాష్ట్రమున బట్టలమిల్లు కనువగు స్థలముకై తిరుగుచుండెను. వెంటనే యావ్యాసమును చదివెను.