పుట:2015.372412.Taataa-Charitramu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యువకులకు కొంత యసంతృప్తికలిగి, 1922 లో ఒక కమిటీద్వారా కొంతవిచారణ జరిగెను. కార్యక్రమమున కొన్నిమార్పుల జేసిరి; అంతట యూరపియను ఉద్యోగులసంఖ్య కొంత తగ్గెను; మనదేశీయపరిశోధకుల సంఖ్య హెచ్చి, తరువాత క్రమముగా అభివృద్ధికలిగెను. ఇప్పుడు పరిశోధనలు, జ్ఞానార్జన, బాగుగ జరుగుచున్నవి. ఆశాఖలం దిచ్చట గల పరిశోధనావకాశములు మనదేశమందిం కెచ్చటను లేవు. ప్రసిద్ధవైజ్ఞానిక గ్రంథములు విజ్ఞాన పత్రికలన్నియు వివిధ పరిశోధన యంత్రములు నిచ్చటదొరకును.

వైజ్ఞానిక విషయములందును పరిశ్రమలగూర్చి ప్రభుత్వముకు పారిశ్రామికులకు నిందు సహాయము చేయబడును. ముఖ్యముగ మైసూరు రాష్ట్రపుపరిశ్రమల కిందలి పరిశోధనలచే చాల లాభముకల్గినది. అనేకవిధములగు ముడిదినుసులు, యంత్రనిర్మాణము, వస్తుతత్వము, వీనినిగూర్చి, ఇందనుకూల పరిశొధనలు జరిగినవి. వాని ఫలితముగ మైసూరులో ప్రశస్తమగు సబ్బుబిళ్ళలు, చందనపుతైలము, గట్టికర్రల పిండిజేయు విధము, అల్యూమినం, గంధకం, సోడియం మున్నగు రసాయన వస్తువుల జేయుట, విద్యుచ్ఛక్తి యుత్పత్తి, పెన్సిలులు మున్నగు వాని తయారు, వీనికి చౌకయగు వైజ్ఞానికపద్ధతులు కనిపెట్టబడి, అందుల కర్మాగారము లీ విజ్ఞానాలయపు సహాయమున నిర్మింపబడినవి.