పుట:2015.372412.Taataa-Charitramu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రప్పింపబడెను. దానికో 'ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌' (భారతీయవిజ్ఞానాలయము) అని పేరుపెట్టిరి. తరువాత కొన్ని వివరముల గూర్చి 'ట్రావర్సు' గారికిని మనప్రభుత్వము వారికిని తగవువచ్చి, కొన్నియేండ్లు చర్చజరిగెను. తాతాగారిచ్చిన యాస్తులవలన సాలినా ఆదాయము రు 125000 మాత్రముండునని ప్రభుత్వ ప్రతినిధు లంచనావేసిరి; మైసూరుప్రభుత్వము సాలినా రు 50000 ఇచ్చుచు; ఈరెంటిలో సగము అనగా రు 87500 సాలీనాయును భవనాదులకై ఒకసారిగ రెండున్నర లక్షలును భారతప్రభుత్వమిచ్చుటకు తుదకు నిర్ణయమయ్యెను. అంతట 1911 వయేట కార్యక్రమ మారంభించిరి. జీవరసాయనవిద్య, విద్యుచ్ఛక్తి, వైద్యశాస్త్రము, సాంకేతికవిద్య, తత్వశాస్త్రము, ఈశాఖల నేర్పర్చి, అందు పరిశోధన లారంభించిరి. అవసరమగు యంత్రపరికరములు, భవనములు, గ్రంథభాండారము, సిద్ధముచేయబడెను.

ప్రభుత్వముతో నభిప్రాయభేదము కలిగి, ట్రావర్సుగారు త్వరలోనే యిందుండి వెడలిపోయిరి. తరువాతవచ్చిన డైరక్టర్లు, గొప్పపరిశోధకులుకారు; వారు సాధారణముగా మనప్రభుత్వశాఖనుండి వచ్చిన యూరపియనులు; మామూలు నిర్వహణమందేగాని, విజ్ఞాన పరిశోధనలందు వారికంతగా ప్రజ్ఞలేదు; భవనాదులకే చాలసొమ్ము ఖర్చగుచుండెను. మొదట నాశించినంత విజ్ఞానకృషి జరుగ లేదని కొంతకాలముకు గుసగుసలు బయలుదేరెను.