పుట:2015.370800.Shatakasanputamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. కనకంబందు ఘనీభవించిన కళంకంబెల్ల సువ్యక్తిగా
     ననలాస్యంబునఁ దెఁగిపోవు గతి జీవాత్మం బ్రవేశించి చే
     కొని వర్తించిన దుర్మలత్రయపరిక్షోభంబు నీ భక్తిచే
     తను బాపంబడుఁ గాని యొండొకటి చేతం బోదు సర్వేశ్వరా!68
మ. అమరంగా గురుమంత్రకార్ముకమునం దాత్మాస్త్రమష్టాంగయో
     గమహాముష్టి వివేకి యేయుటయుఁ దత్కాండం బజాండాది త
     త్త్వములెల్ల న్వడి నుచ్చిపాఱి భవదుద్యత్సూక్ష్మకైవల్యల
     క్ష్యమునం దద్భుతశక్తితోడఁ గమియంగా నాఁటు సర్వేశ్వరా!69
మ. తనరం గాయవహిత్రమందు హృదయస్తంభాభిసంస్థానమై
     చను నీ ధ్యానపటంబు నూల్కొలిపి భాస్వద్భక్తివాతాహతి
     న్వినుతజ్ఞానపథంబు చేకొని సముద్వేగంబుమై జీవుఁ డీ
     ఘనసంసారమహార్ణవంబుఁ గడుపంగాఁ బాఱు సర్వేశ్వరా!70
మ. అకలంకస్థిరభక్తి మున్సొగయ నిన్నశ్రాంతముం జూచి పా
     యక పూజించు మహామహుండు భవదభ్యర్చ్యుం డగుంగాక దా
     సకలేచ్ఛావిషయంబులం బొగయుచుం జాపల్యతం జేయు నా
     బకవేషార్చనలేల నిన్ను సొగయింపం జాలు సర్వేశ్వరా!71