పుట:2015.370800.Shatakasanputamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     కతనిం బ్రార్థనసేసి సొమ్ముగొనిపో నఱ్ఱాడునే భక్తుఁ డీ
     క్షితి నీ భక్తియ వేఁడుఁ గాక మఱి నీ శ్రీపాదము ల్గొల్చి కు
     త్సితకామ్యార్థము లొండు వేఁడుకొనునే చింతింప సర్వేశ్వరా!45
మ. భ్రమరధ్యానము దాల్చి కీటకము సద్భావాదిసంయుక్తిఁ దా
     భ్రమరంబై ఖగవీథి నాడునని నన్బాటించి నిన్నాత్మ నె
     య్యముతో ధ్యానము సేయు మర్త్యుఁడును నీయట్లే పరవ్యో
     మతత్త్వమునం దవ్యయలీల నుండు టరుదే భావింప సర్వేశ్వరా!46
మ. అమరశ్రేణులకు న్సుధామయకళౌఘాత్మీయసారంబు ర
     గ్యముగాఁ గ్రోలఁగ నిచ్చి తానొక కళామాత్రాంగుఁడై యున్న చం
     ద్రమునిం జూచి జగమ్ము మ్రొక్కుగతినారన్ భక్తపూజానిధి
     క్రమభారాకృశుఁ జూచి మ్రొక్కుదురు లోకంబెల్ల సర్వేశ్వరా!47
మ. చెదరం బాఱు దశప్రభంజనములన్ శిక్షన్ సుషుమ్నంబునం
     గుదియం బట్టి చలింపకుండ శశినర్కుం గట్టి భాస్వన్మన
     స్సదనస్థానమునందు నిన్నెలమి సంస్థాప్యంబుగాఁ జేసి తా
     హృదయానందరసాబ్ధిఁ దేలు శివయోగీంద్రుండు సర్వేశ్వరా!48