పుట:2015.370800.Shatakasanputamu.pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

యథావాక్కుల అన్నమయ్యకవివిరచిత

సర్వేశ్వరశతకము

శా. శ్రీకంఠుం బరమేశు నవ్యయు నిజశ్రీపాదదివ్యప్రభా
     నీకోత్సారితదేవతానిటలదుర్నీత్యక్షరధ్వాంతుఁ జి
     త్ప్రాకామ్యాంగు నపాంగమాత్రరచితబ్రహ్మాండసంఘాతు జం
     ద్రాకల్పుం బ్రణుతింతు నిన్ను మది నాహ్లాదింతు సర్వేశ్వరా!1
మ. ఒకమా టీసకలంబు నీ మయముగా నూహించుచు న్వెండి యొ
     క్కొకమాటింతయు నీవు గావనుచు నేయుక్తిం బ్రశంసింప నే
     రక వేదంబులు చిక్కుపడ్డవనినం బ్రవ్యక్తమై యుండు భా
     వకుఁడై నీ నిజరూప మిట్టిదన నెవ్వండోపు సర్వేశ్వరా!2
శా. జ్ఞానాతీతుఁడవైన నీ మహిమఁ బ్రజ్ఞం బూని తర్కించు ట
     జ్ఞానాంగంబగు నైననుం దమ యథాశక్తిం బ్రశంసించి ది
     వ్యానందస్థితిఁ బొందువారిఁ గని భక్త్యావృత్తి నిన్నెట్టివాఁ
     డైనం బ్రస్తుతి సేయుచుండుఁ దనచే నైనంత సర్వేశ్వరా!3