పుట:2015.370800.Shatakasanputamu.pdf/625

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డు. ఈశతకమునఁ గవి తనగోత్రము తండ్రిపేరు చెప్పుకొనకపోవుటవలనఁ గవినిగూర్చిన విశేషాంశములు గురుతింప వీలుకలుగుట లేదు. కొటికలపూడివారిలో నందవరీకులు వైదికులు గలరు. రెండుకుటుంబములయందును బూర్వకవులు కలరుగాని మారుతిశతకకర్త గోత్రము చెప్పుకొనకపోవుటచే నేశాఖీయుఁడో నిర్ణయింప వీలులేకపోయినది. ఈశతకము వ్రాసిన కోదండరామకవి ఉభయభాషలలో మంచిపండితుఁడును నిరర్గళకవితాధారగలవాఁడనియు శతకమును బఠించినవా రెఱుంగఁగలరు.

మారుతిశతకము మృదుమధురధారతో నుండుటచేఁ బఠనీయముగా నున్నది. ఆంజనేయుని దివ్యలీల లుత్ప్రేక్షించుచు రామాయణమునకు సంబంధించిన చర్యలను వర్ణించుచు వాలాద్యవయవములను గొండాడుచు నొక్కొక్కపద్య మొక్కొక్కనూతనభావముతో నలంకరించి కవి మనోహరముగా శతకము రచించియున్నాడు. క్రొత్తపోకడలతో నిండియున్న యీశతకము పఠనీయమైయున్నది.

నందిగామ.

ఇట్లు భాషాసేవకులు,

1-1-25.

శేషాద్రిరమణకవులు, శతావధానులు.