పుట:2015.370800.Shatakasanputamu.pdf/575

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఛందోవ్యాకరణాదినిర్బంధశృంఖలలకు లోనుగావలెనా యని కవి స్వతంత్రించినటుల నిందలి వ్యాకరణదోషములు తెలుపుచున్నవి. మొదటినుండి కడమవఱ కీశతకము కవికి దుదిగ్రంథమనియే తెలుపుచున్నది. ఈకని యౌవనమున గోపాలలీలాసుధాలహరి యను ప్రబంధము మూఁడాశ్వాసములుగ వ్రాసెను. ఈతనియింటిపేరు ప్రయాగవారనియు, వైదికబ్రాహ్మణుఁడనియు, సర్వేశ్వరపుత్రుఁడనియు నాప్రబంధమునఁ గలదు. గోపాలలీలాసుధాలహరి కేవలశృంగారరసముతోఁ దులతూగుచున్నది. గోపాలలీలాసుధాలహరి రామతీర్థస్వామి కంకితము గావింపఁబడుటవలనను కవివంశావతారాదికమువలనను ఇతఁడు విశాఖపట్టణమండలమునకుఁ జెందినవాడని యూహచేయ వీలుకలుగుచున్నది. ఈశతకలిఖితప్రతి మాడుగులలోఁ జిక్కుటయుఁ గవి విశాఖపట్టణము మండలమువాఁడనుట కొకతార్కాణము. ఈకవి యిప్పటికి నూటయిఱువదిసంవత్సరముల క్రిందనున్నటులఁ జెప్పుచున్నారు.

ఈశతకము వ్రాఁతప్రతి మాకంపిన విశాఖపట్ణము జిల్లా మాడుగులవాస్తవ్యులు శ్రీయుత బీ. సీ. వై. నారాయణశర్మగారు వందనీయులు.

వావిళ్ల . రామస్వామిశాస్త్రులు ఆండ్ సన్స్.