పుట:2015.370800.Shatakasanputamu.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామరాఘవశతకము

621


ప్రాపునఁ జేరి ని న్నెపుడు ప్రస్తుతిచేయుచునున్నయట్టినా
యాపదలెల్లఁ దోలుటను నర్హముగాదఁటె రామ...

94


ఉ.

నీపదపద్మరేణువులనేరు పహల్య యెఱుంగుఁగాని నీ
రూపము రావణానుజుఁ డెఱుంగునుగాని భవత్ప్రభావ మ
గ్గోపతి నారదుం డెఱుఁగు క్రూరుఁడ నేఁ దెలియంగఁజాల నా
తాపములెల్లఁ దీర్చుటకు దాతవు నీ విఁక రామ...

95


ఉ.

ఇష్టముతోడ మిమ్ము భజియింపగ నింతపరాక దేల నా
యిష్టము దీర్ప మీ మది కభీష్టముగాదె భరించువారలే
కష్టముగాఁ దలంప నిఁక గావఁగ నేరిఁక నిట్టికష్టముల్
నష్టమొనర్చి ప్రోవు మిఁక నన్నుఁ బ్రసన్నత రామ...

96


చ.

తనయుఁడవై దయారసతఁ దారకమంత్రము నా కొసంగవే
యన విని దేవహూతికి సమంచిత్రమంత్రరహస్య మంతయున్
మనమున నిండఁజెప్ప కడుమానితమోక్ష మొసంగినట్ల నా
మనమునఁ గోర్కిదీర్చి నను మన్నన చేయవె రామ...

97


చ.

నిను మదిఁ గోరి నమ్మినను నేరము లెంచిన నేమి చేయువాఁ
డను గృప నన్ను వేడుకను డాయగఁ రావె యవస్థలన్నియు
న్మునుకొని మీకుఁ దేటపడ ముందుగ నేఁ దగవిన్నవించితిన్
గనుఁగొని కావకున్న ననుఁ గావఁగ నెవ్వరు రామ...

98