పుట:2015.370800.Shatakasanputamu.pdf/540

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈ రామరాఘవశతకమును పల్లి పార్వతీశముగారు రచించిరి. ఈయన నివాసస్థానము గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాలోని గుత్తికొండ యనుగ్రామము. వీరి దారపుత్రాదులు గుత్తికొండలోనే యున్నారు. 1908-వ సం॥ న నేను దాళపత్రగ్రంథాన్వేషణప్రయత్నములో నున్నతఱిఁ బార్వతీశముగారి కుమారులు వారింట నున్నగ్రంథముల నా కొసఁగిరి. వానిలో నీశతకముకూడ నుండెను. పార్వతీశముగారి తండ్రిపేరు నరసింహముగారు. నరసింహముగారుకూడఁ బద్యరచన చేయుచుండినట్లు కన్పట్టుచున్నది. శబ్దాలంకారములకొఱకుఁ బాటుపడినస్థలములఁ దప్పఁ దక్కినచోటుల నీశతకమున దోషము లంతగా లేవు. అందందు వ్యాకరణవిరుద్ధప్రయోగములు కన్పట్టుచునే యున్నవి. గ్రంథ మొక్కటి రచింపవలెనను సంకల్పముచేతమాత్రమే ప్రేరేపింపబడినవారు వ్రాసిన గ్రంథము లనేకములు మనకుఁ గలవు. పార్వతీశముగారు శతకము వ్రాసినకాలమునఁ బద్యరచనయందలి వేలమువెఱ్ఱి యిప్పుడున్నంత లేదు.